Begin typing your search above and press return to search.

జాక్.. అన్ని వేళ్లూ అతడి వైపే

బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసిన దర్శకుడు భాస్కర్.

By:  Tupaki Desk   |   13 April 2025 8:00 PM IST
జాక్.. అన్ని వేళ్లూ అతడి వైపే
X

బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసిన దర్శకుడు భాస్కర్. తమిళుడైనప్పటికీ.. అతను టాలీవుడ్లో దర్శకుడిగా ప్రయత్నాలు చేసి, దిల్ రాజు బేనర్లో తీసిన ‘బొమ్మరిల్లు’తో గొప్ప పేరే సంపాదించాడు. తెలుగు సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘బొమ్మరిల్లు’ పేరు సంపాదించింది. దీంతో భాస్కర్ పేరు ముందు ‘బొమ్మరిల్లు’ అన్నది ఇంటి పేరుగా మారిపోయింది.

ఐతే తొలి సినిమాతో తన మీద పెరిగిన అంచనాలను ఆ తర్వాత అతను అందుకోలేకపోయాడు. ‘పరుగు’తో పర్వాలేదనిపించినా.. తర్వాతి చిత్రాలన్నీ వరుసగా డిజాస్టర్లే అయ్యాయి. ‘ఆరెంజ్’ సినిమా మెగా ఫ్యామిలీని షేక్ చేసేంత డిజాస్టర్ అయింది. ఆపై బెంగళూరు డేస్ రీమేక్, ఒంగోలు గిత్త భాస్కర్‌ను ఇంకా కిందికి లాగేశాయి. దీంతో చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. కొన్నేళ్ల కిందట ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌‌’తో రీఎంట్రీలో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నాడు భాస్కర్. కానీ ఇప్పుడు ‘జాక్’తో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

సిద్ధు జొన్నలగడ్డ లాంటి సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో దొరికాడు. ‘బేబీ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైష్ణవి చైతన్య హీరోయిన్. ప్రకాష్ రాజ్ సహా ఫేమస్ ఆర్టిస్టులున్నారు. ఖర్చు విషయంలో రాజీ పడని నిర్మాత ఉన్నాడు. కానీ ఈ వనరులను భాస్కర్ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. రొటీన్ కథను ఎంచుకుని నీరసం తెప్పించే కథనంతో సినిమాను నిస్సారంగా తయారు చేశాడు. సిద్ధు తన మార్కు ఎంటర్టైన్మెంట్‌తో సినిమాను ఎంత కాపాడాలని చూసినా కూడా ఫలితం లేకపోయింది.

సినిమాకు ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయన్నా.. ప్రేక్షకులు అంతో ఇంతో ఎంటర్టైన్ అయ్యారన్నా అది సిద్ధు మహిమే తప్ప.. దర్శకుడి నైపుణ్యం ఏమీ లేదు. భాస్కర్‌ను నమ్మి సినిమా మీద బాగా ఖర్చు పెట్టిన నిర్మాత అన్యాయం అయిపోయాడు. వీకెండ్లోనే సినిమా డౌన్ అయిపోయింది. రిజల్ట్ డిజాస్టర్ అని తేలిపోయింది. ఈ ఫలితానికి పూర్తి బాధ్యత భాస్కరే వహించాల్సి వస్తోంది. ఇక ఈ పరిస్థితుల్లో అతడికి ఇంకో సినిమా దక్కడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.