Begin typing your search above and press return to search.

10 కోట్ల నష్టపరిహారం.. బాంబే హైకోర్టులో పలాష్ ముచ్చల్ కు భారీ ఊరట!

ఈ విషయంలో ఇప్పుడు పలాష్ కి బాంబే హైకోర్టు నుండి మధ్యంతర ఉపశమనం లభించింది. ఈ మేరకు పలాష్ తరఫు న్యాయవాది శ్రేయాన్స్ ఆర్ మిథారే స్పందిస్తూ..

By:  Madhu Reddy   |   13 Feb 2026 7:00 PM IST
10 కోట్ల నష్టపరిహారం.. బాంబే హైకోర్టులో పలాష్ ముచ్చల్ కు భారీ ఊరట!
X

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు, సినిమా దర్శకుడు అయిన పలాష్ ముచ్చల్.. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన విద్యాన్ మానేపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే . ఈ విషయంలో ఇప్పుడు పలాష్ కి బాంబే హైకోర్టు నుండి మధ్యంతర ఉపశమనం లభించింది. ఈ మేరకు పలాష్ తరఫు న్యాయవాది శ్రేయాన్స్ ఆర్ మిథారే స్పందిస్తూ.. "విద్యాన్ మానేపై పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలాష్ ప్రతిష్టకు హాని కలిగించే ప్రకటనలు ఇకపై విద్యాన్ మానే చేయకుండా నిరోధించింది. దీంతో బాంబే హైకోర్టు తీర్పు మేరకు పలాష్ కి భారీ ఊరట లభించిందని" శ్రేయాన్స్ ఆర్ మిథారే చెప్పుకొచ్చారు. ఇకపోతే తదుపరి విచారణను మార్చ్ 11 కు వాయిదా వేశారు.

అసలేమైంది అనే విషయానికి వస్తే.. పలాష్ ముచ్చల్.. ప్రముఖ ఫిమేల్ క్రికెటర్ స్మృతి మందానాతో రిలేషన్ ను కన్ఫామ్ చేస్తూ.. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. గత ఏడాది నవంబర్లో వివాహం కూడా చేసుకోవాల్సి ఉంది. కానీ పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి బ్రేకప్ చేసుకున్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై అటు స్మృతి, ఇటు పలాష్ ఇద్దరూ కూడా అధికారికంగా స్పందిస్తూ తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. గోప్యతకు భంగం కలిగించవద్దు అని సోషల్ మీడియా వేదికగా కోరారు.

అయితే ఈ విషయం గురించి అభిమానులు మరిచిపోయే లోపే.. నిరంతరం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు పలాష్ ముచ్చల్. ముఖ్యంగా స్మృతి స్నేహితుడు, ప్రముఖ నిర్మాత విద్యాన్ మానే పలాష్ పై ఆరోపణలు చేయడమే కాకుండా పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం పలాష్ అంటూ ఆరోపించారు. పెళ్లికి కొన్ని గంటల ముందు వివాహ సమయంలో మరో మహిళతో పలాష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని, పట్టుబడిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు పలాష్ ను తీవ్రంగా కొట్టిందని కూడా చెప్పారు.

పైగా పలాష్ తనను ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపించాడు. దీనిపై విద్యాన్ మానే మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 5న పలాష్ ను కలిశాను. పలాష్ తెరకెక్కిస్తున్న 'నజారియా' సినిమాలో నిర్మాతగా పెట్టుబడి పెట్టే అవకాశం నాకు ఇచ్చాడు. 25 లక్షల పెట్టుబడి పెడితే.. 12 లక్షల లాభం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇక 2025 మార్చి నాటికి పలాష్ కి మొత్తం రూ.40 లక్షలు చెల్లించాను. అయితే ఆ సినిమా పూర్తి కాలేదు. నా డబ్బు తిరిగి ఇవ్వమని చెబితే పలాష్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు" అంటూ సాంగ్లీ పోలీసులకు విద్యాన్ మానే ఫిర్యాదు చేశాడు.

అయితే కొంతకాలం సైలెంట్ గా ఉన్న పలాష్ ముచ్చల్.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆరోపించాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో.." నా న్యాయవాది శ్రేయాన్స్.. సాంగ్లీ నివాసి విద్యాన్ మానే నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు 10 కోట్ల రూపాయల పరువు నష్టం.. నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు దాఖలు చేశారు. ఈ ఆరోపణలు నా వ్యక్తిత్వం, నా ప్రతిష్టకు దెబ్బతీసేందుకే చేశారు" అంటూ పలాష్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ కేసు విచారణలో పలాష్ కి భారీ ఊరట లభించింది.