స్టార్ హీరో వేగంగా తినడానికి ఈ సమస్య కారణమా?
స్టార్ల ఖరీదైన జాలీ లైఫ్ గురించి సామాన్యులు ఎక్కువ ఊహించుకుంటారు. కానీ అందరికీ ఎదురైనట్టే సెలబ్రిటీలకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి
By: Tupaki Desk | 20 Aug 2023 5:12 PM ISTస్టార్ల ఖరీదైన జాలీ లైఫ్ గురించి సామాన్యులు ఎక్కువ ఊహించుకుంటారు. కానీ అందరికీ ఎదురైనట్టే సెలబ్రిటీలకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు ఎవరూ అతీతం కాదు. ఒక ప్రముఖ స్టార్ హీరోకు అరుదైన అనారోగ్య సమస్య ఉంది. దీనివల్ల అతడు వేగంగా అన్నం తినేస్తాడు.. తొందరగా మాట్లాడేస్తుంటాడు.. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అంటే.. ది గ్రేట్ రణబీర్ కపూర్.
బాలీవుడ్ లో నటవారసుడిగా అడుగుపెట్టినా తనదైన ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగిన రణబీర్ కపూర్ మగువల గుండెల్లో మారాజుగా ఏల్తున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమాతో ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తదుపరి బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ లోను రణబీర్ నటిస్తున్నాడు. ఇక సహనటి ఆలియాభట్ ని రణబీర్ ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఒక ఆడపిల్ల జన్మించగా రాహా అని పేరు పెట్టుకున్నారు. ఇకపోతే రణబీర్ కపూర్ కి అత్యంత వేగంగా ఆహారం తినే అలవాటు ఉందని సన్నిహితులు చెబుతుంటారు. అతడు చిన్నతనం నుండి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని.. దానివల్లనే త్వరగా మాట్లాడుతాడని .. త్వరగా తినేస్తాడని సన్నిహితులు చెబుతారు.
రణబీర్‌కు చిన్నప్పటి నుంచి నాసికా సెప్టం అనే అరుదైన అనారోగ్య సమస్య ఉంది. దీంతో అతని ముక్కు ఎముక కాస్త వంకరగా ఉంటుంది. తనకు ఈ పరిస్థితి ఉన్నప్పటికీ రణబీర్ దిద్దుబాటు కోసం శస్త్రచికిత్స చేయించుకోకూడదని భావించాడు. 2009లో ఒక సినిమా పాత్ర కోసం అతనికి ముక్కు సూటిగా ఉండడం చాలా అవసరం. దీంతో దర్శకుడు శస్త్రచికిత్సను సూచించాడు. అయితే ఆ ఆలోచనను రణబీర్ గట్టిగా తిరస్కరించాడు.
రణబీర్ సన్నిహిత మిత్రుడు ఈ సమస్య గురించి మీడియాకు వెల్లడించాడు. రణబీర్ చిన్నప్పటి నుండి నాసల్ సెప్టం అనే ముక్కు సమస్యను ఎదుర్కొంటున్నాడు. చెవి, ముక్కు, గొంతు (ENT) చికిత్సలో నిపుణులైన వైద్యులు సెప్టోప్లాస్టీ అనే విధానాన్ని సూచించారు. అయితే రణబీర్ ఈ చికిత్సను తిరస్కరించాడు. అతడు ఎల్లప్పుడూ చాలా నిశ్చయంతో ఉంటాడు. ఏదో ఒకదానిపై తన మనస్సును ఏర్పరచుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉంటాడు.. అని తెలిపారు. తల్లిదండ్రులు రిషి కపూర్ - నీతూ కపూర్ కూడా ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకోవాలని రణబీర్ ని పలుమార్లు ఒప్పించారు. చివరికి వారు విరమించుకున్నారు. రణబీర్ శస్త్రచికిత్స ఆలోచనకు వ్యతిరేకం కాదు. కానీ అతడు ఎందుకో ఆందోళన చెందుతున్నాడు. తన ముక్కు ఆకారాన్ని మార్చడం గురించి ఒకసారి నాతో ఇలా అన్నాడు. ``ఈ వంకరను తీయించే కంటే ఇలానే ఉంచుకుంటాను`` అని అన్నాడు.
నాసికా సెప్టం నాసికా రంధ్రాలను వేరుచేసే సన్నని గోడ. దాని స్థానం మారితే అది వంకరగా కనిపిస్తుంది. ఈ తప్పుడు అమరిక జీన్స్ సమస్య లేదా గాయం వంటి కారణాల వల్ల సంభవించవచ్చు. వంగిన సెప్టం ముక్కులో గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు, గురక- సైనస్ ఇన్ఫెక్షన్‌లకు ఎక్కువ అవకాశం కలిగిస్తుంది. చికిత్స చేయించుకోవడమే సరైన విధానం. సెప్టల్ అమరికను సరిచేయడానికి శస్త్రచికిత్సా విధానాలున్నాయి. నాసికా శ్వాస జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ చికిత్స సహకరిస్తుంది.
