ఖాన్‌లు మారారు కానీ ఈయన మారడు!
పాత సీసాలో కొత్త సారాయి నింపి కాసులు కురిపించాలనుకుంటే ఇక కష్టమే. స్టార్ హీరోలు దీనిని గ్రహిస్తున్నారు.
By: Tupaki Desk | 25 April 2025 9:18 AM ISTపాత సీసాలో కొత్త సారాయి నింపి కాసులు కురిపించాలనుకుంటే ఇక కష్టమే. స్టార్ హీరోలు దీనిని గ్రహిస్తున్నారు. ఓటీటీ - డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా కొత్తదనం నిండిన కంటెంట్‌ని అందిస్తేనే జనం థియేటర్లకు వస్తున్నారు.
అయితే ఇటీవలి కాలంలో ఓటీటీలు, బుల్లితెరలు కూడా మెరుగైన కంటెంట్ ని అందిస్తూ ప్రేక్షకులను సుస్థిరం చేసుకుంటున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ నేల విడిచి సాము చేస్తూ, సరైన కథలు ఉన్న సినిమాలను అందించడంలో తడబడుతోంది. ఈ విషయాన్ని షారూఖ్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు స్వయంగా అంగీకరిస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాలీవుడ్ క్షీణ దశలో ఉందని ఒప్పుకున్నారు. అదే సమయంలో సౌత్ సినిమా బాక్సాఫీస్ మ్యాజిక్ ని కీర్తించకుండా బాద్ షా షారూఖ్ ఆగడం లేదు.
అయితే వరుసగా డజను ఫ్లాప్ చిత్రాలతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఖిలాడీ అక్షయ్ కుమార్ మాత్రం తన రూట్ ని మార్చడంలో విఫలమవుతున్నాడని విమర్శలొస్తున్నాయి. పాత కంటెంట్ ని కొత్తగా చూపించాలని అతడు ప్రయత్నించడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురవుతోంది. అతడు నటించిన తాజా చిత్రం `కేసరి 2` ఆడుతున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తుండడంతో సర్వత్రా దీనిపై చర్చ సాగుతోంది. 2024లో హిందీ సినిమా నికర బాక్సాఫీస్ కలెక్షన్లు 13 శాతం తగ్గాయని కూడా లెక్కలు చెబుతున్నాయి.
ఓటీటీల్లో వెరైటీ సినిమాలు, వెబ్ సిరీస్ లకు అలవాటు పడిన యూత్ ఇప్పుడు థియేటర్ల వైపు మోజు చూపడం లేదు. ఇది కూడా హిందీ చిత్రసీమకు సవాల్‌గానే మారింది. ప్రేక్షకులు మునుపటిలా లేరు. చాలా అభివృద్ధి చెందారు. అభిరుచి పీక్స్ లో ఉంది. హాలీవుడ్ స్థాయి విజువల్ గ్రాండియారిటీతో అసాధారణ చిత్రాలను అందిస్తేనే థియేటర్లకు వరకూ వచ్చేందుకు ఆస్కారం ఉంది. దీనికి అనుగుణంగా ఫిలింమేకర్స్, హీరోల ఆలోచనలు కూడా మారాల్సి ఉందని విశ్లేషిస్తున్నారు.
