మళ్లీ ప్రేమ కథల టైం వచ్చిందేమో..!
బాలీవుడ్‌లో దశాబ్దం ముందు వరుకు ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అలా వచ్చిన ప్రేమ కథలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
By: Tupaki Desk | 10 Jun 2025 12:36 PM ISTరామ్ గోపాల్ వర్మ చెప్పినట్లుగా ఒకప్పుడు బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో పాటు మరికొందరు సీనియర్ హీరోలు యంగ్ ఏజ్‌లో చేసిన యాక్షన్, మాస్ మసాలా సినిమాలు అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాస్ మసాలా సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో మ్యూజిక్ కంపెనీలు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి సంగీత నేపథ్యంలో సినిమాలను రూపొందించారు. దాంతో బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల లోటు మొదలైంది. బాలీవుడ్‌లో రూపొంది సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలను సౌత్‌లో చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు రీమేక్ చేసి సూపర్ స్టార్‌లు అయ్యారని వర్మ పేర్కొన్నాడు.
బాలీవుడ్‌లో దశాబ్దం ముందు వరుకు ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అలా వచ్చిన ప్రేమ కథలు సూపర్ హిట్‌గా నిలిచాయి. షారుఖ్ ఖాన్‌తో పాటు, సల్మాన్, అమీర్ ఖాన్‌లు సైతం ప్రేమ కథా చిత్రాల వల్లే స్టార్స్‌గా నిలిచారు. లవ్ స్టోరీ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలోనే స్పై థ్రిల్లర్ జోరు మొదలు అయ్యాయి. చాలా సినిమాలు అదే జోనర్‌లో వచ్చి హిట్‌గా నిలిచాయి. వందల కోట్ల వసూళ్లను సాధించాయి. కానీ గత కొన్నాళ్లుగా స్పై థ్రిల్లర్‌లకు ఆధరణ తగ్గుతూ వస్తుంది. ప్రతి సినిమాలోనూ అదే నేపథ్యం ఉంటున్న కారణంగా ప్రేక్షకులు విసుగు చెంది పోయారు. అవసరమా అన్నట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో వచ్చిన వార్, పటాన్‌తో పాటు మరికొన్ని స్పై థ్రిల్లర్స్ అదే కథ, అదే నేపథ్యంతో వచ్చిన నేపథ్యంలో ముందు ముందు రాబోతున్న స్పై సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. టైగర్ సినిమాతో హిట్ కొట్టిన సల్మాన్ ఆ తర్వాత స్పై థ్రిల్లర్‌లను చేసినా ఆకట్టుకోలేక పోయాడు. అదే ఫార్ములా ఇతర హీరోలకు ముందు ముందు వర్తించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్స్‌ను మానేసి మాస్ మసాలా సినిమాలతో పాటు ప్రముఖంగా లవ్ స్టోరీ సినిమాలు చేస్తే బాగుంటుందని ఒక వర్గం ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. మెల్ల మెల్లగా ప్రేక్షకులను ఆ జోనర్‌కి అలవాటు చేయాలని భావిస్తున్నారు.
జనరేషన్‌లు మారుతున్నా కొద్ది ఫిల్మ్ మేకింగ్ విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే బాలీవుడ్‌లో కొత్త వారు మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వారిని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంకరేజ్ చేయాల్సి ఉంది. పెద్ద నిర్మాతలు అలాంటి సినిమాలను తీస్తేనే బాలీవుడ్‌లో మార్పు వస్తుంది. కరోనా సమయం నుంచి బాలీవుడ్‌లో సక్సెస్ రేటు దారుణంగా పడి పోయింది. కనీసం అయిదు నుంచి పది శాతం కూడా సక్సెస్ రేటు నమోదు కావడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే బాలీవుడ్‌లో కూడా సౌత్‌లో మాదిరిగా అన్ని రకాల సినిమాలను తీస్తూ ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.