Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: ఖాన్‌ల‌కే ఎందుకు ఈ హ‌త్యా బెదిరింపులు?

కేవలం సినిమాల పరంగానే కాకుండా.. వారి వ్యక్తిగత జీవితాలను సైతం టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ దాడులు బాలీవుడ్ ప్రముఖులలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   16 July 2026 10:30 AM IST
ట్రెండీ స్టోరి: ఖాన్‌ల‌కే ఎందుకు ఈ హ‌త్యా బెదిరింపులు?
X

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా శాసిస్తున్న 'ఖాన్‌ల‌ త్రయం' (సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్) ర‌క‌ర‌కాల సంద‌ర్భాల‌లో ప్రాణ భయానికి గురి కావాల్సి వ‌చ్చింది. స‌ల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ ఇప్ప‌టికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ క‌క్ష క‌ట్టి వార్నింగులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అడ‌పాద‌డ‌పా షారూఖ్ కి కూడా కొన్ని హ‌త్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి.

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను చంపేసిన వారికి ఏకంగా ఐదు కోట్ల రూపాయల బహుమతి ఇస్తానంటూ అయోధ్యకు చెందిన ఒక మత పెద్ద బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. వారి వ్యక్తిగత జీవితాలను సైతం టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ దాడులు బాలీవుడ్ ప్రముఖులలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ జంట‌ వివాహం తర్వాత ఆమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై వరుస దాడులు మొదలయ్యాయి. బజరంగ్ దళ్ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు అత‌డికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీనిని `లవ్ జిహాద్`గా అభివర్ణిస్తూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణె, అమీర్ ఖాన్‌ను 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అని తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదం కాస్తా ముదిరి, చివరకు అయోధ్యలోని తపస్వి ఛావానీ అధిపతి జగద్గురు పరమహంస ఆచార్య అమీర్ ఖాన్‌ను హతమార్చిన వారికి రూ.5 కోట్లు ఇస్తానని.. ఆ వ్యక్తిపై వచ్చే న్యాయపరమైన ఖర్చులను కూడా తానే భరిస్తానని ప్రకటించే వరకు వెళ్లింది.

మరోవైపు బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి తీవ్ర ప్రాణాపాయ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కృష్ణజింకల వేట వివాదం నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ ముఠా పదేపదే హెచ్చరించడమే కాకుండా, ఆయన నివాసంపై కాల్పులకు సైతం తెగబడింది. అలాగే స‌ల్మాన్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రాణాలతో వదిలేయాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం అప్ప‌ట్లో సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం సల్మాన్‌కు ప్రభుత్వం భారీ భద్రతను కల్పించాల్సి వచ్చింది.

ఈ బెదిరింపుల పర్వం కేవలం సల్మాన్, అమీర్ ఖాన్‌లకే పరిమితం కాలేదు. గతంలో ట్రేడ్ మార్క్ స్టార్ షారూఖ్ ఖాన్ కూడా ఇలాంటి తీవ్రమైన హెచ్చరికలను ఎదుర్కొన్నారు. ఆయన నటించిన కొన్ని సినిమాలలోని కంటెంట్ లేదా సమాజంలో ఆయన వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాల కారణంగా ఉగ్రవాద సంస్థల నుండి.. కొన్ని తీవ్రవాద ముఠాల నుండి ఆయనకు చంపేస్తామనే లేఖలు, ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ సమయంలో షారూఖ్ ఖాన్ భద్రతను ముంబై పోలీసులు వై-ప్లస్ కేటగిరీకి పెంచాల్సి వచ్చింది. ఇలా ముగ్గురు ఖాన్ లు నిరంతరం రక్షణ వలయంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలు ఈ ముగ్గురు 'ఖాన్'లపైనే ఎందుకింత వ్యతిరేకత పెరుగుతోందనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. వీరు భారతదేశంలోనే పుట్టి ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నా.. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొందరు వీరి మతాన్ని, వ్యక్తిగత వివాహ బంధాలను టార్గెట్ చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. సినిమాల్లోని పాత్రల ద్వారా లేదా వారి నిజ జీవిత నిర్ణయాల ద్వారా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న ఈ ఖాన్‌ల తలకాయలకు ఇలా కోట్లలో వెలకట్టడం ప్రజాస్వామ్య దేశంలో ఆందోళన కలిగించే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.