నీరసపడిపోయిన ఇండస్ట్రీకి ఊపిరి పోసేదెలా?
అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ ని ఆదుకునేందుకు సీక్వెల్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 9:22 AM ISTకొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ కి ఒక తెలుగు దర్శకుడు యావరేజ్ విజయాన్ని అందించాడు. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజతో మాస్ సినిమాల్ని తీసి విజయాలు అందుకున్న గోపిచంద్ మలినేని బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ తో `జాత్` అనే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాడు. జాత్ 100 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఇది కేవలం పెట్టుబడిని మాత్రమే వెనక్కి తెచ్చింది. మరోవైపు వరుస పరాజయాలతో కొన్నేళ్లుగా డీలా పడిపోయిన అక్షయ్ కుమార్ `కేసరి 2` బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ షోగా మిగిలింది. ఈ సినిమా పరిమిత బడ్జెట్ తో రూపొందించిన కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో అది కొంతవరకూ కాపాడగలిగింది కానీ...అక్షయ్ లాంటి పెద్ద స్టార్ కి కేవలం 60 కోట్ల వసూళ్లు అతి పెద్ద నిరాశ.
అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ ని ఆదుకునేందుకు సీక్వెల్ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వీటిలో హౌస్ ఫుల్ 5 , రైడ్ 2 కీలకంగా మారాయి. ఖిలాడీ అక్షయ్ కుమార్ జూన్ లో విడుదల కానున్న `హౌస్ ఫుల్ 5` తో ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో హాస్యం, రొమాన్స్, యాక్షన్ కంటెంట్‌తో తాజా చిత్రం ప్రజల్ని థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నారు. అక్షయ్ కి కొన్నేళ్లుగా వరుస పరాజయాలు నీరసం మిగిల్చాయి. అందుకే ఇప్పుడు `హౌస్‌ఫుల్ 5` బ్లాక్ బస్టర్ విజయం సాధించి అతడిలో ఉత్సాహం నింపాల్సి ఉంది. ఒక రకంగా అక్షయ్ కుమార్ కి చిట్టచివరి కీలక ఆప్షన్ అని విశ్లేషిస్తున్నారు.
మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన గత చిత్రం `సింగం 3` ఫలితం నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు అతడు నటించిన సీక్వెల్ చిత్రం `రైడ్ 2` సరైన బ్లాక్ బస్టర్ గా మారాల్సి ఉంది. మే1న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే హైప్ ఆశించిన స్థాయిలో లేదు. ఈ రెండు సినిమాలు భారీ తారాగణంతో ఉత్సుకతను రేకెత్తిస్తున్నా, ప్రచారం పరంగా వెనకబాటు ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు సీక్వెల్స్ కంటే ముందు రాజ్ కుమార్ రావు భూల్ చుక్ మాఫ్, సంజయ్ దత్ `ది భూత్నీ` విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల ఫలితంపైనా ఉత్కంఠ నెలకొంది. బాలీవుడ్ క్షీణ దశ గురించి ఇండస్ట్రీ దిగ్గజాలంతా చర్చా సమావేశాల్ని నిర్వహిస్తున్న తరుణంలో ఉత్సాహం నింపే సినిమాలు ఏవి? అన్నది వేచి చూడాలి.
