పాన్ ఇండియా సినిమా అంటే వాళ్లు ఉండాల్సిందేనా?
అయితే స్టార్ హీరోలు చేస్తున్న ప్రతీ పాన్ ఇండియా సినిమా కోసం మేకర్స్ బాలీవుడ్ హీరోయిన్లనే రంగంలోకి దించుతున్నారు.
By: Tupaki Desk | 15 May 2025 8:30 AM ISTప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సినిమా ఎన్ని భాషల్లో రిలీజైతే అంత పెద్ద సినిమా అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. పెద్ద హీరోల దగ్గరి నుంచి చిన్న, మీడియం తరహా హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా దాన్ని పాన్ ఇండియా స్థాయిలోనే చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే స్టార్ హీరోలు చేస్తున్న ప్రతీ పాన్ ఇండియా సినిమా కోసం మేకర్స్ బాలీవుడ్ హీరోయిన్లనే రంగంలోకి దించుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. స్టార్ హీరోలు నటించే సినిమాలు ఎలాగూ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతాయి కాబట్టి బాలీవుడ్ భామలకు రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులుండవు.
దీంతో సౌత్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలన్నీ బాలీవుడ్ భామల చేతుల్లోకి వెళ్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, కల్కి, ఫౌజీ, స్పిరిట్ అన్ని సినిమాల్లోనూ పక్క భాషల నుంచి హీరోయిన్లను తెస్తున్నారు. ఇక ఎన్టీఆర్ దేవర నుంచి దేవర2, ప్రశాంత్ నీల్ సినిమా కోసం కూడా పక్క భాషల హీరోయిన్ల వైపే మేకర్స్ కళ్లున్నాయి.
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్, ఇప్పుడు చేస్తున్న పెద్ది లో కూడా బాలీవుడ్ హీరోయిన్లే. బన్నీ ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్‌నే తీసుకోవాలని చూస్తున్నారట. ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ భామలను తీసుకోవడానికి ఓ రీజనుంది. బాలీవుడ్ భామలకు ఉండే స్టార్ స్టేటస్, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ వారిని తీసుకుంటున్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది.
