సందీప్ వంగాకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు
అయితే సందీప్ వంగా ఇంటెన్స్ డ్రామాను ఎంత అద్భుతంగా తెరకెక్కించినా, అధిక రక్తపాతం, హింస కారణంగా కొందరి నుంచి వ్యతిరేకితను ఎదుర్కొన్నాడు.
By: Tupaki Desk | 21 July 2025 1:00 AM ISTరాజమౌళి, సుకుమార్ లాంటి ఉద్ధండులైన దర్శకులు ఉన్న గడ్డపై నుంచే వచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అతడు కూడా ఆ ఇద్దరిలానే పాన్ ఇండియా డైరెక్టర్. సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు పాన్ ఇండియాలో చర్చగా మారాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ గురించి దేశవ్యాప్తంగా కొన్నేళ్ల పాటు చర్చించుకున్నారు. అర్జున్ రెడ్డి ఇరుగు పొరుగు భాషల్లో రీమేక్ అయింది. యానిమల్ చిత్రం ఏకంగా 880కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. భారతదేశంలో అత్యధికంగా చర్చించింది ఈ చిత్రం గురించే.
అయితే సందీప్ వంగా ఇంటెన్స్ డ్రామాను ఎంత అద్భుతంగా తెరకెక్కించినా, అధిక రక్తపాతం, హింస కారణంగా కొందరి నుంచి వ్యతిరేకితను ఎదుర్కొన్నాడు. అతడు స్త్రీ విద్వేషి అని కూడా విమర్శించారు. అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు సందీప్ వంగాను మొదట విమర్శించి, ఆ తర్వాత ఇలాంటి దర్శకుడిని వేరొకరిని చూడలేదు! అంటూ భుజంపై చేయి వేసి గంటల కొద్దీ సమయం మాట్లాడాడు. సందీప్ కి అభిమానిగా మారాడు. నిజాయితీగా సినిమా తీసే దర్శకుడు అని ప్రశంసించాడు. ఆషిఖి 2, ఏక్ విలన్ లాంటి బ్లాక్ బస్టర్లను తెరకెక్కించిన మోహిత్ సూరి సైయారా చిత్రంతో ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజా ఇంటర్వ్యూల్లో తన మనసులో ఉన్న విషయాలను బయటపెడుతున్నాడు.
చాలా మంది సందీప్ వంగాను విమర్శించిన వ్యక్తులు తమలోని కుళ్లును బయటపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో ప్రముఖ దర్శకుడు సందీప్ వంగాపై తన అభిమానాన్ని దాచుకోలేకపోయాడు. అంతేకాదు.. సందీప్ వంగాకు అతడు క్షమాపణలు కూడా చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో మోహిత్ సూరి తాను సందీప్ వంగాకు పెద్ద అభిమానినని అన్నాడు. యానిమల్ చిత్రాన్ని చాలా ఇష్టపడతానని, కానీ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవ్వడం వల్ల తాను సైలెంట్ గా ఉన్నానని, కానీ అలాంటి సమయంలో మద్ధతుగా నిలవకపోవడం తన తప్పేనని అన్నాడు. అందుకు సందీప్ కి క్షమాపణలు చెప్పాడు. నిజాయితీ, ధృఢ నిశ్చయంతో సినిమాలు తీసే నిజమైన దర్శకుడు సందీప్ వంగా అని ప్రశంసించాడు. బాలీవుడ్ నుంచి ఇతర పెద్ద దర్శకులు కూడా సందీప్ వంగాను అభిమానిస్తారు. అయితే బయటపడరు.. అంతే!
