ఈసారైనా స్టార్ హీరో విమర్శలకు చెక్ పెడతాడా?
రాజ్ కుమార్ హిరాణీ లాంటి ప్రముఖ దర్శకుడు పీకే సీక్వెల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఇందులో అమీర్ తో పాటు, రణబీర్ కపూర్ మరో కీలక పాత్రను పోషిస్తారని తెలిసింది.
By: Tupaki Desk | 5 Jun 2025 4:00 AM ISTబాలీవుడ్ కథలు, కంటెంట్ పరంగా క్రైసిస్ ని ఎదుర్కొంటోంది. పర్యవసానంగా, పాత వాటినే తిప్పి తీస్తున్నారు. లేదా పొరుగు భాషల్లో హిట్టయిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే హిట్టయిన సీక్వెల్ సినిమాల్ని పొడిగిస్తూ, అసంబద్ధమైన అంతగా కనెక్టివిటీ లేని కథల్ని తెరపై చూపించి విసిగిస్తున్నారు.
కారణం ఏదైనా ఫ్రెష్ నెస్ లేని కథలతో బాలీవుడ్ నీరసపడిపోయింది. ఇక ఖాన్‌లలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చడ్డా` రీమేక్‌తో పెద్ద దెబ్బ తిన్నాడు. ఇప్పుడు సీక్వెల్ సినిమా `సితారే జమీన్ పర్` అతడిని ఆదుకుంటుందో లేదో అనే సందేహాలున్నాయి. ఇలాంటి సమయంలో అమీర్ తదుపరి బ్లాక్ బస్టర్ మూవీ `పీకే` సీక్వెల్ గురించి మాట్లాడుతున్నాడు.
రాజ్ కుమార్ హిరాణీ లాంటి ప్రముఖ దర్శకుడు పీకే సీక్వెల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఇందులో అమీర్ తో పాటు, రణబీర్ కపూర్ మరో కీలక పాత్రను పోషిస్తారని తెలిసింది. అయితే పీకే లాంటి క్రేజీ సినిమాకు సీక్వెల్ తీస్తే, అది జనాల్లో బజ్ పెంచవచ్చు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ట్రెండ్ వేరుగా ఉంది. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ని అనుసరించి కథను ఎంపిక చేయకపోతే పెద్ద దెబ్బ తింటారు. కులమత విభేధాలు, మతతత్వం వంటి అంశాలను అతడు టచ్ చేయకూడదు. పీకే సమయంలో ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో గమనించాడు గనుక నాటి వివాదాలను రిపీట్ చేయడం సరికాదు.
ఇదేగాక అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లాపాటా లేడీస్ కానీ, అమీర్ తెరకెక్కించిన సితారే జమీన్ పార్ కానీ కాపీ కథలతో రూపొందించినవి అని విమర్శలొచ్చాయి. అందువల్ల అతడు తదుపరి తెరకెక్కించే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అమీర్ ఈసారి పాత తప్పులు రిపీట్ చేయకుండా ముందుకు సాగుతాడనే ఆశిస్తున్నారు. ముఖ్యంగా క్రియేటివిటీ ఉన్న కంటెంట్ ని అతడు ఎంపిక చేయాల్సి ఉంటుంది.
