ఆ హీరోయిన్ తల్లిదండ్రులకు పెళ్లి చేసింది గాంధీ ఫ్యామిలీ!
నెహ్రూ గారే రజనీ పటేల్‌ను భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్య్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని కోరారట.
By: Srikanth Kontham | 28 April 2026 8:45 AM ISTబాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి - దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబమైన ఇందిరా గాంధీ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అమీషా పటేల్ తాతగారు ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త బారిస్టర్ రజనీ పటేల్ అని, ఆయనకు నెహ్రూ-గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రెండు కుటుంబాలు ఎంతో స్నేహంగా ఉండేవని వివరించారు. అమీషా పటేల్ వెల్లడించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఆమె తల్లిదండ్రుల వివాహ ముహూర్తాన్ని స్వయంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయించారట.
తన తాతగారిపై ఉన్న గౌరవంతో ఇందిరా గాంధీ స్వయంగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన తేదీని ఖరారు చేశారని అమీషా తెలిపారు. ఇది తన కుటుంబ చరిత్రలో గొప్ప గౌరవంగా భావిస్తానన్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లో తమ కుటుంబం ఎంతటి క్రియాశీలక పాత్ర పోషించిందో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు . అమీషా తాత రజనీ పటేల్ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే వంటి వారితో కలిసి లండన్‌లో చదువుకున్నారన్నారు. ఆ సమయంలోనే వారికి జవహర్‌లాల్ నెహ్రూతో పరిచయం ఏర్పడిందని వివరించారు.
నెహ్రూ గారే రజనీ పటేల్‌ను భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్య్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని కోరారట. ఈ చారిత్రక నేపథ్యం వల్లే తమ కుటుంబానికి ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో ప్రత్యేకమైన స్థానం ఉండేదని అమీషా చెప్పుకొచ్చారు. తన బాల్యంలో ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీలను కలిసిన జ్ఞాపకాలను కూడా అమీషా ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. వారు తమ ఇంటికి తరచుగా వచ్చేవారని రాజకీయాల కంటే కుటుంబ సభ్యుల్లాగే కూర్చుని ముచ్చటించేవారని తెలిపారు. రాజీవ్ గాంధీ తనను ఎంతో ఆప్యాయంగా చూసు కునేవారని అప్పట్లో తనకు ఆ రాజకీయ హోదా గురించి పెద్దగా తెలియకపోయినా? వారు చూపించే ప్రేమ మాత్రం ఇప్పటికీ గుర్తుందన్నారు.
దీంతో అమీషా పటేల్ కేవలం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి మాత్రమే కాదు. బలమైన రాజకీయ , సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారని తెలుస్తోంది. తన కుటుంబానికి ఉన్న చారిత్రక మూలాలను ప్రపంచానికి తెలియజేయడంతో ఆమె వారసత్వం పట్ల ఉన్న గర్వాన్ని చాటుకున్నారు. అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక అమీషా కెరీర్ పరంగా అప్పుడప్పుడు వెండి తెరపై మెరవడం తప్ప సీరియస్ గా సినిమాలు చేయడం లేదు. అవకాశాలు కూడాఅ ంతగా రావడం లేదు.
