బాలీవుడ్ తారల కొత్త ట్రెండ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదీ జరిగే వరకు నమ్మలేం. ఒకరితో మొదలుపెట్టిన ప్రాజెక్టు మరొకరి చేతిలోకి వెళ్లడం, అనౌన్స్ చేసిన సినిమా నుంచి నటీనటులు తప్పుకోవడం, కొన్నిసార్లైతే ఏకంగా ఆ ప్రాజెక్టు ఆగిపోవడం కూడా జరుగుతాయి.
By: Tupaki Desk | 3 Jun 2025 1:58 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదీ జరిగే వరకు నమ్మలేం. ఒకరితో మొదలుపెట్టిన ప్రాజెక్టు మరొకరి చేతిలోకి వెళ్లడం, అనౌన్స్ చేసిన సినిమా నుంచి నటీనటులు తప్పుకోవడం, కొన్నిసార్లైతే ఏకంగా ఆ ప్రాజెక్టు ఆగిపోవడం కూడా జరుగుతాయి. బాలీవుడ్ లో ఈ మధ్య ఇలాంటి వింత ధోరణి ఒకటి రెగ్యులర్ గా జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ కమిట్ అయిన భారీ బడ్జెట్ సినిమాల నుంచి కొంత మంది బాలీవుడ్ నటీనటులు తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
అందులో కొందరు తప్పని పరిస్థితుల్లో తప్పుకుంటుంటే మరికొందరు అనవసర విషయాల వల్ల ఆ ప్రాజెక్టులను వదులుకుంటున్నారు. ఈ విషయం అటు ఫ్యాన్స్‌నీ, ఇటు దర్శకనిర్మాతలను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. అలా భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలను మిస్ చేసుకున్న సెలబ్రిటీలు బాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. వారిలో పరేల్ రావల్ ఒకరు.
హేరా ఫేరి3 నుంచి అతను తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హేరా ఫేరిలో ఐకానిక్ బాబూరావ్ ఆప్టే పాత్రలో నటించి అందరినీ మెప్పించిన ఆయన హేరా ఫేరి3 నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో పరేల్ రావల్ పై అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ కేసు కూడా పెట్టాడని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అందరూ ఎంతో ఎదురుచూస్తున్న బాలీవుడ్ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు రామాయణం సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన సీతగా నటించడానికి మొదట్లో ఆలియా భట్ సైన్ చేసింది కానీ తర్వాత తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ వల్ల ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రను ఇప్పుడు సాయి పల్లవి చేస్తోంది.
ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ సినిమాలో దీపికా ప్లేస్ లో త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డైరెక్టర్ సందీప్ ఓపెన్ గా చెప్పాడు. తనకు వెన్నుపోటు పొడిచి కథను లీక్ చేశారని ఫైర్ అవుతూ సందీప్ ఈ విషయమై ట్వీట్ కూడా చేశాడు. యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ కూడా నటించాల్సింది కానీ ఆమె షెడ్యూల్స్ కుదరకపోవడంతో టాక్సిక్ నుంచి ఆమె తప్పుకుంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ చేయాల్సిన రాక్షస్ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకునే టైమ్ లో ఆగిపోయింది. ఇద్దరికీ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇప్పుడదే ప్రాజెక్టు ను ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయడానికి చూస్తున్నాడని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా నడుస్తున్న ఈ ట్రెండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. మంచి మంచి ప్రాజెక్టుల్లో ఆఫర్లు రావడం, వారు ప్రాజెక్టులో చేరడం వల్ల సినిమాపై హైప్ పెరగడం, ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి వారు తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.
