Begin typing your search above and press return to search.

ముంబైలో రూ. 252 కోట్ల డ్రగ్స్ రాకెట్.. లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు?

ముంబై పోలీస్ వర్గాలు ఇప్పుడు ఒక భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   15 Nov 2025 2:33 PM IST
ముంబైలో రూ. 252 కోట్ల డ్రగ్స్ రాకెట్.. లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు?
X

ముంబై పోలీస్ వర్గాలు ఇప్పుడు ఒక భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు రూ. 252 కోట్లకు పైగా విలువైన వ్యవహారమని, దీని మూలాలు అండర్‌వరల్డ్ వరకు పాకి ఉండవచ్చని కథనాలు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు కొందరి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తుండటం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి జరిగిన పార్టీలలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రముఖ డాన్సర్ నోరా ఫతేహి పేర్లు ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్, సోషల్ మీడియా స్టార్ ఓర్రీ, దర్శకులు అబ్బాస్ మస్తాన్, రాజకీయ నాయకుడి కుమారుడు జీషాన్ సిద్దిఖీ పేర్లు కూడా నార్త్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈ రాకెట్‌కు సంబంధించి ముంబై, దుబాయ్‌లలో భారీ పార్టీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పార్టీలను మహమ్మద్ సలీం సుహైల్ షేక్ అనే వ్యక్తి నిర్వహించినట్లు సమాచారం. ఇతను అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం డోలాకు అత్యంత సన్నిహితుడని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఈ కేసులో మరో కీలకమైన కోణం కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలిష్ పార్కర్ కూడా ఈ పార్టీలకు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే శ్రద్ధా కపూర్ పేరు బలంగా వినిపించడానికి మరో కారణం కూడా ఉంది. గతంలో హసీనా పార్కర్ బయోపిక్‌లో శ్రద్ధా కపూరే ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం.

అయితే, ఈ వార్తలు బయటకు వచ్చిన వెంటనే నటి నోరా ఫతేహి తీవ్రంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని, తన పేరును అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆమె మండిపడ్డారు.

ప్రస్తుతానికి, ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పుడే పేర్లను ధృవీకరించలేమని, అయితే అవసరాన్ని బట్టి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.