బిల్లా-రంగా చేతుల్లో జస్ట్ మిస్ అయిన బాబిడియోల్!
1978లో జరిగిన `రంగా-బిల్లా` ఉదంతం దేశవ్యాప్తంగా అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఢిల్లీకి చెందిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు మైనర్ తోబుట్టువులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఈ కేసు నాటి తరాలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
By: Srikanth Kontham | 13 Jun 2026 1:54 PM IST1978లో జరిగిన `రంగా-బిల్లా` ఉదంతం దేశవ్యాప్తంగా అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఢిల్లీకి చెందిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు మైనర్ తోబుట్టువులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఈ కేసు నాటి తరాలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఘటన ఆధారంగా చేసుకుని ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో `రాఖ్` అనే సరికొత్త ట్రూ-క్రైమ్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నాటి భయానక వాతావరణాన్ని మరోసారి కళ్లముందుకు తెచ్చింది.
అయితే ఈ సిరీస్ కేవలం వెండితెర కథ మాత్రమే కాదు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ జీవితంతో దీనికి వ్యక్తిగత సంబంధం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల టాక్ షోలో పాల్గొన్న బాబీ డియోల్ రంగా-బిల్లా నేరస్థులు తన బాల్యాన్ని ఎలా అతలాకుతలం చేశారో గుర్తుచేసుకున్నారు. తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలో తన ప్రాణ స్నేహితుడిని నేరస్థుల జంట కిడ్నాప్ చేసిందని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఇద్దరు కిడ్నాపర్ల మధ్య జరిగిన గందరగోళం వల్ల పోలీసుల వేట తీవ్రమవడంతో వారు ఆ అబ్బాయిని ఒక పాన్ షాప్ వద్ద వదిలేసి పారిపోయారు.
అలా తన స్నేహితుడు ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. కానీ అసలు భయం అక్కడే మొదలైంది. కిడ్నాపర్లు నిర్బంధంలో ఉన్న సమయంలో ఆ బాలుడిని బెదిరించి అతని స్కూల్లో ఉండే ఇతర ధనిక పిల్లల పేర్లు అడిగారు. భయంతో ఆ అబ్బాయి బాబీ డియోల్ పేరును కూడా చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే బాబీ డియోల్ తండ్రి, లెజెండరీ నటుడు ధర్మేంద్ర తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన కొడుకు భద్రతను కాపాడటం కోసం ఆయన ఇంట్లో కఠినమైన నిబంధనలు, కర్ఫ్యూ విధించారు. స్కూల్ నుండి రాగానే ఇల్లు దాటడానికి వీల్లేకుండా కట్టడి చేశారు.
చివరికి బాబీ డియోల్ సైకిల్ తొక్కడం కూడా ఇంటి లోపలే నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ భయం ఎంతలా వెంటాడిందంటే? బాబీ డియోల్ కాలేజీ రోజుల్లోకి వచ్చినా రాత్రి 9 గంటలకల్లా ఇంటికి చేరుకోవాలనే కఠినమైన రూల్స్ కొనసాగాయి. స్నేహితుల ఇళ్లలో పార్టీలు జరిగితే ఏర్పాట్లలో సహాయం చేసి పార్టీ ప్రారంభం కాకముందే ఇంటికి వచ్చేయాల్సి వచ్చేది. ఆ కిడ్నాపర్లు పట్టుబడి వారికి ఉరిశిక్ష పడిన తర్వాత కూడా డియోల్ కుటుంబంలో ఆ భయం పూర్తిగా పోలేదని తన స్నేహితులంతా బయట తిరుగుతుంటే తాను మాత్రం ఇంట్లోనే బందీగా ఉండిపోవాల్సి వచ్చిందని బాబీ డియోల్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. 1978 ఆగస్టు 26న నేవీ అధికారి పిల్లలైన గీతా చోప్రా (16), సంజయ్ చోప్రా (14) ఆల్ ఇండియా రేడియో కార్యక్రమానికి వెళ్తుండగా కుల్జీత్ సింగ్ అలియాస్ రంగా, జస్బీర్ సింగ్ అలియాస్ బిల్లా అనే ఇద్దరు దొంగిలించిన కారులో వారిని అపహరించారు. ఆ పిల్లలు ప్రాణాలు కాపాడుకోవడానికి కిడ్నాపర్లతో తీవ్రంగా పోరాడినప్పటికీ నేరస్థులు వారిని క్రూరంగా హింసించి హత్య చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 1978లో వారిని అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఇద్దరికీ మరణశిక్ష విధించగా 1982లో తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలుచేశారు.
ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న `రాఖ్` వెబ్ సిరీస్ సరిగ్గా ఇదే కాలం నాటి ఢిల్లీ నేపథ్యంలో సాగుతుంది. సబ్-ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ (అలీ ఫజల్) ఈ కేసును ఎలా దర్యాప్తు చేశాడు? ఈ నేరం వల్ల ఆయా కుటుంబాలు అనుభవించిన మానసిక వేదన.. నగరంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని దర్శకుడు ప్రోసిత్ రాయ్ అత్యంత సహజంగా తెరకెక్కించారు. ఒక భయంకరమైన నిజ జీవిత నేరం సమాజంపై, ముఖ్యంగా చిన్న పిల్లల భద్రతపై ఎలాంటి ముద్ర వేస్తుందో ?ఈ సిరీస్ బాబీ డియోల్ వ్యక్తిగత జీవిత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
