స్టార్ విలన్ రేంజ్ రోవర్ వెనక సందీప్ వంగా
బ్యాక్ టు బ్యాక్ వరుసగా అడ్వాన్సులు అందుకుంటున్న బాబీ డియోల్ రూ.2.95 కోట్ల విలువైన అత్యంత వేగవంతమైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు.
By: Tupaki Desk | 16 April 2025 6:10 PMఅతడు నటుడిగా జీరో అయిపోయాడు. సినీపరిశ్రమ ఆల్మోస్ట్ మర్చిపోయింది. కొన్నేళ్ల పాటు నిర్జీవంగా ఉండిపోయాడు. కానీ ఓపిగ్గా వేచి చూస్తే, ``ఎవ్వెరీ డాగ్ హాజ్ ఏ డే!``. ప్రతి ఒక్కరికీ ఒక రోజొస్తుంది. అలాంటి ఒక రోజు వచ్చింది. అతడి జాతకం ఓవర్ నైట్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమా అతడి కెరీర్‌ని దారిలోకి తెచ్చింది. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. సౌత్ లో భారీ చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు.
దీనికోసం భారీ పారితోషికాలు డిమాండ్ చేసే స్థాయికి పుంజుకున్నాడు. తిరిగి మునుపటిలా హైఫై లైఫ్ ని ఆస్వాధిస్తున్నాడు. ఫాలోవర్స్ తో సెల్ఫీలు దిగుతున్నాడు. వేదికలపై రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. అతడు ఎవరు? అంటే.. కచ్ఛితంగా బాబి డియోల్. బాబి జాతకం మార్చిన గురువు సందీప్ రెడ్డి వంగా. ది గ్రేట్ తెలుగు డైరెక్టర్. ఒకే ఒక్క యానిమల్ సినిమాతో బాబి డియోల్ రేంజును అమాంతం ఆకాశం ఎత్తుకు చేర్చాడు అతడు.
అందుకే ఇప్పుడు ఖరీదైన రేంజ్ రోవర్ ని సొంతం చేసుకున్న బాబిడియోల్ ని తలవగానే ముందుగా సందీప్ రెడ్డి వంగానే అందరికీ గుర్తుకు వచ్చాడు. ఇలాంటి ఒక రోజు వచ్చింది అంటే డియోల్ కచ్ఛితంగా గుర్తు చేసుకోవాల్సింది వంగానే.. చాలా వేదికలపై తనకు పునర్జన్మనిచ్చింది సందీప్ వంగా అని బాబిడియోల్ వ్యాఖ్యానించాడు.
బ్యాక్ టు బ్యాక్ వరుసగా అడ్వాన్సులు అందుకుంటున్న బాబీ డియోల్ రూ.2.95 కోట్ల విలువైన అత్యంత వేగవంతమైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూ అని చెబుతున్న ఈ కార్ లుక్ అద్భుతం. బ్లూ నెబ్యులా కలర్ ఎస్.యు.వి ఎంతో రాయల్ గా కనిపిస్తోంది. బాబి సెలక్షన్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ టూలో 4.4-లీటర్ ట్విన్-టర్బో మైల్డ్-హైబ్రిడ్ V8 ఇంజిన్ ఉంటుంది. దాని పనితీరు గరిష్ట స్థాయిలో 626 హెచ్.పి శక్తిని, 800 ఎన్.ఎ టార్క్‌ను విడుదల చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు బదిలీ అవుతుంది. ఈ ఎస్.యు.వి కార్ 3.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/ గంటకు పరుగెత్తగలదు. అయితే గరిష్ట వేగం గంటకు 290కి.మీ ప్రయాణించగలదు. ఇప్పటివరకూ అత్యంత వేగవంతమైన SUVలలో ఒకటి ఇది. దీనికి 23-అంగుళాల నకిలీ అల్లాయ్ వీల్స్ అదనపు బలం.
బాబి యానిమల్ తర్వాత కంగువ, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించాడు. మరో అరడజను చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. పవన్ కల్యాణ్ - హరి హర వీరమల్లు, ఆలియా భట్ - ఆల్ఫా, దళపతి విజయ్- జననాయగన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సంతకాలు చేస్తూనే ఉన్నాడు.