Begin typing your search above and press return to search.

చేగువేరా జీవితంపై డ‌జ‌ను బ‌యోపిక్‌లు!

By:  Tupaki Desk   |   20 Aug 2023 7:09 AM GMT
చేగువేరా జీవితంపై డ‌జ‌ను బ‌యోపిక్‌లు!
X

విప్లవ యోధుడు చేగువేరా జీవితంపై డ‌జ‌ను పైగానే బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. ఇప్పుడు ఆయ‌న‌పై ఓ తెలుగు ద‌ర్శ‌కుడు సినిమా తీస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. స్వ‌యంగా చేగువేరా కూతురు డా. అలైదా గువేరా చేతుల మీదుగా `చే` అనే తెలుగు మూవీ పోస్టర్ ని ఇటీవ‌ల‌ లాంచ్ చేసారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న ఈ సినిమాకి `చే` అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. `లాంగ్ లైవ్` అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ ప‌నుల్లో ఉంది. విప్లవ వీరుడు, యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను ఒక తెలుగువాడు సినిమా గా తీయడం ఆస‌క్తిక‌రం.

ఈ సంద‌ర్భంగా `చే గువేరా`పై తప్పక చూడవలసిన సినిమాలు ఏవో ప‌రిశీలిస్తే ఆసక్తిక‌ర విష‌యాలే తెలిసాయి. ఈ రోజు పాప్ సంస్కృతికి చెందిన అత్యంత పాపుల‌ర్ రాజ‌కీయ నాయ‌కుల్లో ఒకరు అర్జెంటీనా గెరిల్లా నాయకుడు చే గువేరా. అతని స్ఫూర్తిదాయకమైన జీవితం కళ, ఫ్యాషన్ ప్ర‌తిదీ ప్ర‌భావ‌వంత‌మైన‌వి. చేగువేరాపై టాప్ 5 సినిమాల జాబితా ఇది.

1. చే! (1969)

1967లో చేగువేరాను ఉరితీసారు. అనంత‌రం రెండేళ్ళకు హాలీవుడ్‌లో ఈ సైనిక సిద్ధాంతకర్త గురించిన మొదటి చిత్రం రూపొందింది. ఈ బయోపిక్‌లో చేగువేరా పాత్ర పోషించిన నటుడు ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ ఫేమ్ ఒమర్ షరీఫ్. అతను 1956లో క్యూబాలో అడుగుపెట్టినప్పటి నుండి బొలీవియాలో మరణించే వరకు అతని జీవిత విశేషాలను ఈ చిత్రం కవర్ చేస్తుంది. రిచర్డ్ ఫ్లీషర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యూబా విప్లవాన్ని సరైన పద్ధతిలో చిత్రీకరించనందుకు భారీ విమర్శలకు గురైంది.

2. ది మోటార్ సైకిల్ డైరీస్ (2004)

ఎటువంటి సందేహం లేకుండా తప్పక చూడవలసిన చే చిత్రం `ది మోటర్‌సైకిల్ డైరీస్`. ఇందులో మెక్సికన్ నటుడు గేల్ గార్సియా బెర్నాల్ తన ఇరవైలలో `చే ..` పాత్రను పోషించాడు. 1952లో తన స్నేహితుడు అల్బెర్టో గ్రెనడాతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లో చే తన సొంత జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. లాటిన్ అమెరికాలోని కఠినమైన పేద జీవితాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇది చేగువేరాలో విప్లవ స్ఫూర్తిని నాటింది. ఈ చిత్రం వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్ర‌ద‌ర్శిత‌మై.. అవార్డు ఈవెంట్లలో అనేక అవార్డులను గెలుచుకుంది.

3. ది హ్యాండ్స్ ఆఫ్ చే గువేరా (2006)

చే ప్రపంచ సినిమా ఊహలను ఆకర్షించిన ప్ర‌ముఖుడు. `ది హ్యాండ్స్ ఆఫ్ చే గువేరా` అనే డచ్ డాక్యుమెంటరీ ఇతర సినిమాల మాదిరిగా కాకుండా అతని జీవిత ప్ర‌యాణం కాకుండా మ‌ర‌ణం గురించిన సినిమా ఇది. చే గువేరా మరణం తర్వాత అత‌డి చేతులు శరీరం నుండి వేరు చేయబడ్డాయి. ఆ తర్వాత కనిపించకుండా పోయాయి. ఈ డాక్యుమెంటరీలో ఈ మిస్ట‌రీని ప్ర‌శ్నించారు.

4. చే: రైజ్ & ఫాల్ (2007)

మరొక డాక్యుమెంటరీ చిత్రమిది. అర్జెంటీనా ఫిలింమేక‌ర్ ఎడ్వర్డో మోంటెస్-బ్రాడ్లీ దర్శకత్వం వహించిన స్పానిష్ చిత్ర‌మిది. ఈ డాక్యుమెంటరీ కల్పితం కాకుండా చే జీవితమనే సత్యాన్ని పరిశోధించడానికి ప్రయత్నించింది. చేగువేరా చివరి అవశేషాలు బొలీవియా నుండి క్యూబాకు విమానంలో ఎప్పుడు తరలించారు? చే గువేరా సన్నిహితుల సాక్ష్యాలతో ఆర్కైవల్ షాట్‌లను చేర్చడం ద్వారా ఈ డాక్యు సిరీస్ రూపొందింది. వీరిలో అతని సన్నిహిత మిత్రుడు అల్బెర్టో గ్రెనడా .. అతని వ్యక్తిగత గార్డులో జీవించి ఉన్న ముగ్గురు సభ్యులు డాక్యు సిరీస్ లో న‌టించారు.

5. చే (2008)

ఎరిన్ బ్రోకోవిచ్ ఫేమ్ స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చే పాత్రలో బెనిసియో డెల్ టోరో నటించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం అనేక అవార్డులు నామినేషన్లను గెలుచుకుంది అంతేకాదు దీనిని సినిమా శైలిలో చిత్రీకరించారు. మొదటి భాగం ఫిడెల్ కాస్ట్రో దిగినప్పటి నుండి క్యూబా విప్లవానికి సంబంధించినది అయితే, రెండవ భాగం బొలీవియన్ విప్లవం కోసం చేగువేరా చేసిన ప్రయత్నం..అతనిని ఉరితీయడం గురించిన‌ది. 50 మరియు 60లలో లాటిన్ అమెరికా రాజకీయాలు చూసిన ఫ్లక్స్ స్థితిని తెర‌పై చూపారు. చేగువేరా గురించి తెలుసుకోవాల‌నుకునేవారు తప్పక చూడవలసిన చిత్రం ఇది.

క్యూబన్ విప్లవ నాయకుడు చేగువేరా ఎంద‌రికో స్ఫూర్తి. ఇప్పటికీ రాజకీయ సిద్ధాంతకర్తలు - విద్యావేత్తలకు వివాదాస్పదమైన ఒక వారసత్వాన్ని మిగిల్చాడు. రాజకీయాల గురించి పూర్తిగా తెలియని వారికి కూడా అతడు ఎప్పటికీ తిరుగుబాటు తాలూకా ప్రతిసాంస్కృతిక చిహ్నంగా గుర్తుంటాడు.