Begin typing your search above and press return to search.

హమ్మ‌య్య‌! మ‌ల్లూ సినిమాకి బిగ్ రిలీఫ్‌!!

మెర్జ‌ర్లు ఒప్పందాల‌తో పీవీఆర్ వేగంగా పావులు క‌దుపుతుండ‌డంతో ఈ రంగంలో అగ్ర‌గామి సంస్థ‌గా దూసుకుపోతోంది. పీవీఆర్ భార‌త‌దేశంలో టాప్ పొజిష‌న్ లో ఉంద‌నేది ఒక స‌ర్వే.

By:  Tupaki Desk   |   14 April 2024 6:48 AM GMT
హమ్మ‌య్య‌! మ‌ల్లూ సినిమాకి బిగ్ రిలీఫ్‌!!
X

థియేట్రిక‌ల్ రంగంపై మ‌ల్టీప్లెక్సులు గుత్తాధిప‌త్యం సాధిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. రెగ్యుల‌ర్ సింగిల్ స్క్రీన్ల కంటే మ‌ల్టీప్లెక్సుల్లో సినిమాలు చూసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుండ‌డంతో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా వ‌ర్థిల్లుతోంది. ఇక‌పోతే మ‌ల్టీప్లెక్స్ రంగంలో శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న సంస్థ‌గా పీవీఆర్-ఐనాక్స్ కి గుర్తింపు ఉంది. మెర్జ‌ర్లు ఒప్పందాల‌తో పీవీఆర్ వేగంగా పావులు క‌దుపుతుండ‌డంతో ఈ రంగంలో అగ్ర‌గామి సంస్థ‌గా దూసుకుపోతోంది. పీవీఆర్ భార‌త‌దేశంలో టాప్ పొజిష‌న్ లో ఉంద‌నేది ఒక స‌ర్వే.

అయితే ఇంత‌కుముందు స‌లార్ రిలీజ్ స‌మ‌యంలో పీవీఆర్-ఐనాక్స్ గ్యాంబ్లింగ్ గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది. షారూఖ్ ఖాన్ న‌టించిన డంకీని ఉత్త‌రాదిన భారీగా రిలీజ్ చేసేందుకు, ద‌క్షిణాది చిత్ర‌మైన స‌లార్ కి స్క్రీన్ల‌ను కేటాయించ‌కపోవ‌డంతో ద‌క్షిణాదిన ఉన్న అన్ని పీవీఆర్ ఐనాక్స్ థియ‌ట‌ర్ల‌లో 'స‌లార్' విడుద‌ల‌ను ఆపేస్తున్నామ‌ని హోంబ‌లే నిర్మాణ సంస్థ అధినేత కిరంగ‌దూర్ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే పీవీఆర్ తో టిట్ ఫ‌ర్ టాట్ గేమ్ చివ‌రికి ఎండ్ అయ్యి స‌లార్ అన్నిచోట్లా విడుద‌లైంది. భార‌త‌దేశంలో ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించింది. డంకీ కంటే భారీ హైప్ క్రేజ్ తో వ‌చ్చిన‌ స‌లార్ అందుకు త‌గ్గ‌ట్టే భారీ వ‌సూళ్ల‌ను సాధించింది.

అదంతా గ‌తం అనుకుంటే ఇప్పుడు 'స‌లార్' ఎపిసోడ్ కి భిన్నంగా ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ మ‌ల‌యాళీల‌ను ఢీకొట్టింది. PVR INOX భారతదేశంలో మలయాళ చిత్రాలను తమ చైన్ థియేట‌ర్ల‌లో ప్రదర్శించకూడదని నిర్ణయించుకుంది. ఈ ఆకస్మిక నిర్ణయంతో మలయాళ సినీప‌రిశ్ర‌మ వ‌ర్గాలు షాక్ కి గుర‌య్యాయి. ఇటీవ‌ల మ‌ల‌యాళ సినిమా పురోగ‌మిస్తోంది. మొన్న రిలీజైన ఓ రెండు చిత్రాలు భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న స‌మ‌యంలో ఈ నిర్ణ‌యం వాటికి పెద్ద న‌ష్టం క‌లిగించింది. అయితే కొద్దిరోజుల పాటు సాగించిన చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మై తిరిగి పీవీఆర్ ఐనాక్స్ స‌మ‌స్య స‌ద్ధుమ‌ణిగింది.

ఇంత‌కీ స‌మ‌స్యేంటి? అంటే... మల్టీప్లెక్స్ వసూలు చేసే వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF) గురించి పీవీఆర్ ఐనాక్స్ - కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (KFPA) మధ్య వివాదం మొదలైంది. KFPA ప్రొడ్యూసర్స్ డిజిటల్ కంటెంట్ (PDC) పేరుతో వారి స్వంత సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రారంభించారు. దీంతో పీవీఆర్ ఐనాక్స్ ఏప్రిల్ 11 నుండి మలయాళ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయించింది. కానీ ఈ వివాదం స‌ద్ధుమ‌ణిగింది. మాట్లాడుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డంతో ఇప్పుడు అన్ని సినిమాలు నేటి నుండి ఈ మ‌ల్టీప్లెక్సుల్లో అందుబాటులోకి వ‌చ్చాయి. సినీరంగానికి చెందిన పెద్ద‌లు పారిశ్రామిక రంగానికి చెందిన పెద్ద‌లు క‌లిసి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించార‌ని తెలిసింది.