Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఉల్టాపల్టా సీజన్ లో.. భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీ

ఉల్టా పల్టా పేరుతో షురూ చేసిన బిగ్ బాస్ సీజన్ 7లో అన్నీ సిత్రాలే. ఆరంభం నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Oct 2023 5:02 AM GMT
బిగ్ బాస్ ఉల్టాపల్టా సీజన్ లో.. భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీ
X

ఉల్టా పల్టా పేరుతో షురూ చేసిన బిగ్ బాస్ సీజన్ 7లో అన్నీ సిత్రాలే. ఆరంభం నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో భారీగా కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపటం ద్వారా మరో ఆసక్తికర పరిణామానికి తెర తీశారు. ఐదు వారాల క్రితం మొదలైన సీజన్ 7లో ఇప్పటివరకు ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను ఇంటి నుంచి పంపేసిన బిగ్ బాస్.. తాజాగా సీజన్7లో '2ఓ'కు తెర తీశారు.

తాజా ఎపిసోడ్ లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో ఇంట్లోకి పంపి.. అటు ఇంట్లో వారినే కాదు.. ఇటు ప్రేక్షకుల్ని సైతం సర్ ప్రైజ్ చేసేశారు. తాజా ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి వెళ్లిన వారెవరంటే..

1. అంబటి అర్జున్

2. అశ్వినీ శ్రీ

3. భోలే షావలి

4. పూజా మూర్తి

5. నయని పావని

ఇంతకీ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఐదుగురు కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంలోకి వెళితే.. అంబటి అర్జున్ సీరియల్ ఆర్టిస్ట్ గా.. డ్యాన్సర్ గా.. యాంకర్ గా సుపరిచితుడు. మల్టీ టాలెంటెడ్ అయితే అతని అసలు పేరు అంబటి నాగార్జున. వైల్డ్ కార్డు ఎంట్రీ వల్ల హౌస్ లో ఉన్న వారు ఎవరు ఎలాంటి వారన్న విషయంతో పాటు.. ఎవరితో ఎలా నడుచుకోవాలో తనకు అర్థమైందని చెప్పాడు. ఇప్పటివరకు నువ్వు ఆటను చూసి ఇంట్లోకి వచ్చావంటూ హౌస్ లోని వారంటారని.. వాటిని భరించాలన్నాడు.

ఇక.. హౌస్ లోని వారి గురించి చెబుతూ.. యావర్.. ప్రశాంత్ లు దమ్ముగా ఆడుతున్నారంటూ.. అమర్.. సందీప్ దమ్ముగా ఆడట్లేదని వ్యాఖ్యానించాడు. చెప్పే పాయింట్ సరిగా ఉండటం లేదని.. సందీప్ ప్రతి చిన్నదానికి గొడవకు వెళ్తున్నాడని పేర్కొన్నాడు. మరి.. ఇతగాడు హౌస్ లోకి వెళ్లాక ఎలా ఆడతాడో చూడాలి.

వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి వెళ్లిన రెండో కంటెస్టెంట్ అశ్వినీ శ్రీ. ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ గా ఆమె.. ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోయిన రతిక లోటును భర్తీ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. తన పేరెంట్స్ కోరికతోనే తాను చదువు పూర్తి అయ్యాక.. సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది. తనకు కోపం ఎంతో.. ప్రేమ కూడా అంతే ఉంటుందని పేర్కొంది. హౌస్ లో ఉన్న వారిలో బాగా ఆడుతున్న వారిలో శివాజీ.. పల్లవి ప్రశాంత్ లు కాగా.. ప్రియాంక.. శోభాశెట్టిలు ఆశించినంత ఆడట్లేదని చెప్పింది. తాను కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నట్లు చెప్పిన ఆమె.. తన చిన్నతనం నుంచి ఏదైనా అనుకుంటే సాధించి తీరుతానని చెప్పి మరీ హౌస్ లోకి వెళ్లింది. మరేం చేస్తుందో చూడాలి.

హౌస్ లోకి వెళ్లిన మూడో కంటెస్టెంట్ విషయానికి వస్తే భోలే షావలి. ప్రైవేట్ ఆల్బమ్ తో నెటిజన్లకు సుపరిచితుడైన ఇతడు.. తెలంగాణ పాటలతో ఫేమస్. అమ్మ పాట తనకు పాఠమై.. బువ్వ పెడితే పాటతో బిగ్ బాస్ పిలుపును తాను అందుకున్నట్లు చెప్పాడు. తన పేరులోని విలక్షణత గురించి వివరిస్తూ.. వరంగల్ జిల్లాలో ఉన్న దర్గా పేరు భోలే షావలి అని.. చిన్నతనంలో తన పేరెంట్స్ మొక్కుకు ఫలితంగా తనకా పేరు పెట్టినట్లు చెప్పారు. శివాజీ.. ప్రశాంత్ లు హౌస్ లో బాగా ఆడుతున్నారని.. అమర్ దీప్ సరిగా ఆడటం లేదనిపిస్తోందని చెప్పారు. హౌస్ లోకి అడుగు పెట్టిన నాలుగో కంటెస్టెంట్ పూజా మూర్తి.

సీరియల్ నటిగా అందరికి తెలిసిన ఆమె.. గుండమ్మ కథ సీరియల్ లో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నిజానికి ఆమె బిగ్ బాస్ ఆరంభం నుంచి హౌస్ కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. షో ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు ఆమె తండ్రి చనిపోవటంతో ఆగిపోయారు. తానిప్పటికీ తన తండ్రి మరణంలోని బాధ నుంచి కోలుకోలేదని.. తాను బిగ్ బాస్ షోలో పారిస్టిపేట్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఆయనెంతో ఆనందించారన్నారు. తనను ఈ వేదిక మీద నుంచి చూడాలని తన తండ్రి ఆశించినట్లు చెప్పారు. హౌస్ లో దమ్ముగా ఆడుతున్న వారిలో శివాజీ.. సందీప్ మాస్టర్అని చెప్పారు. వైల్డ్ కార్డు ఎంట్రీలో ఐదో కంటెస్టెంట్ నయని పావని. టిక్ టాక్ వీడియోల్లో తనదైన హావభావాలతో అదరగొట్టే ఈ తెలంగాణ అమ్మాయి.. కాసింత సరదాగా మాట్లాడేసి అందరి చూపు తన మీద పడేలా చేసింది.

హౌస్ లో ఉన్న వారిలో దమ్ముగా ఆడుతున్న వారిలో ప్రిన్స్ యువర్.. ప్రశాంత్ లు ఉండగా.. బాగా ఆడని వారిలో అమర్.. తేజలు ఉన్నట్లు చెప్పింది. తేజ.. యావర్.. ప్రశాంత్ ఫోటోలు చూపించి.. ఎవరితో స్నేహం.. ఎవరితో డేట్.. మరెవరితో పెళ్లి అని అడిగితే.. తేజతో ఫ్రెండ్ షిప్ చేస్తానని.. యావర్ తో డేట్ కు వెళ్తానని.. ప్రశాంత్ ను మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పటం ద్వారా.. అందరి చూపు తన మీద పడేలా చేసింది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తుందో చూడాలి.