Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ సీజన్ 7: ఆ 14 మంది ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే

బిగ్ బాస్ 7 సీజన్ మొదలైంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వారే.. చివరకు ఇంట్లోకి అడుగు పెట్టారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 7:04 AM GMT
బిగ్ బాస్ సీజన్ 7: ఆ 14 మంది ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే
X

బిగ్ బాస్ 7 సీజన్ మొదలైంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వారే.. చివరకు ఇంట్లోకి అడుగు పెట్టారు. ఎలాంటి సర్ ప్రైజ్ లు లేకుండా.. ముందు నుంచి అనుకున్న వారే ఇంట్లోకి రావటం జరిగింది. కాకుంటే.. మొదటి ఎపిసోడ్ లోనే అదిరే ట్విస్టు ఇచ్చిన కింగ్ నాగ్..ఈ సీజన్ మీద కొత్త ఆసక్తిని పెంచేలా చేశారు. ఇప్పటికి ఆరు సీజన్లు ముగించుకొని ఏడో సీజన్ ఉల్టాపల్టా అంటూ ఆశ్చర్యానికి గురి చేశారు. మొదటి ఎపిసోడ్ లోనే తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవటానికి ఖుషీ హీరో విజయ్ దేవరకొండ.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హీరో నవీనన్ పొలిశెట్టి టీంలు సందడి చేశాయి. వారు ఇంట్లోకి వెళ్లి కంటెస్టెంట్లను ఉత్సాహపరిచారు.

సీజన్ 7లోని మొదటి ఐదుగురు కంటెస్టెంట్లకు నాగార్జున అదిరే ఆఫర్ ఇవ్వటం ఈ ఎపిసోడ్ కు అదనపు ఆకర్షణగా మారింది. మొదటగా ఇంట్లోకి అడుగు పెట్టిన ఐదుగురు కంటెస్టెంట్లకు బిగ్ ఆఫర్ ఇచ్చారు నాగ్. బ్రీఫ్ కేసులో రూ.20లక్షలు పెట్టి.. వెళ్లిపోవాలనుకున్న వారు ఆ అమౌంట్ ను తీసుకొని బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవచ్చన్నారు. ఆ ఆఫర్ ను పొందిన వారిలో ప్రియాంక జైన్.. శివాజీ.. దామిని భట్ల.. ప్రిన్స్ యువార్.. శుభశ్రీ ఉన్నారు. అయితే.. ఆ ఆఫర్ కు వారంతా నో చెప్పారు.

అయితే.. తాను చెప్పిన రూ.20 లక్షలకు రూ.5 లక్షల చొప్పున పెంచుతూ వెళ్లారు. అలా రూ.20 లక్షల మొత్తం రూ.35 లక్షల వరకు వెళ్లిన వేళలో.. నటుడు శివాజీ.. ఆ అమౌంట్ విషయంలో కొంత ఆసక్తిని ప్రదర్శించారు. చివరి నిమిషంలో మనసు మార్చుకొని.. తనకు రూ.35 లక్షలు వద్దు.. బిగ్ బాస్ హౌస్ లో ఉండటమే ముద్దుగా తేల్చారు. మొదటి రోజే.. ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు వీలుగా ఇచ్చిన ఆఫర్ చూస్తుంటే.. ఈ సీజన్ లో మరిన్ని షాకింగ్ ఆఫర్లు ఉంటాయన్న మాట వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్లు ఎవరన్నది చూస్తే..

1. ప్రియాంక జైన్

చల్తే.. చల్తే.. వినరా సోదరా వీర కుమార తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తోంది.

2. శివాజీ

తెలుగు ప్రజలకు సుపరిచితులు.. హీరోగా తనదైన సినిమాలతో అలరించి.. ఆపై రాజకీయాలతో.. సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో అందరూ తన గురించి మాట్లాడేలా చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో మిస్టర్ అండ్ మిసెస్ శైలజా క్రిష్ణమూర్తి.. మిస్సమ్మ.. తాజ్ మహల్ చిత్రాలు హైలెట్. 2016లో సీసా ఆయన చివరి మూవీ. 2018లో గ్యాంగ్ స్టర్స్ అనే వెబ్ సిరీస్ లో కనిపించారు.

3. దామిని భట్ల

బాహుబలిలో పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో.. కొండపొలంలో ధమ్ ధమ్ ధమ్ తదితర హిట్ పాటలతో గాయనిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

4. ప్రిన్స్ యువార్

పలు సీరియల్స్ లో నటించిన ఈ బాడీ బిల్డర్ యువ ప్రేక్షకులకు సుపరిచితులు

5. శుభశ్రీ

రుద్రవీణ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ఒడిశా నటి కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేవారు. మిస్ ఇండియా 2020 టైటిల్ను సొంతం చేసుకున్నారు. సినిమాలకు ముందు లాయర్ గా పని చేసిన మల్టీ టాలెంటెడ్.

6.షకీలా

మలయాళ చిత్రసీమలో స్టార్ హీరోలకు సైతం తన హాట్ సినిమాలతో చుక్కలు చూపించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె ప్రత్యేక సినిమాలు ఒకప్పుడు సంచలనంగా మారటం తెలిసిందే. ఆమె వ్యక్తిగత జీవితం సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండటం తెలిసిందే.

7. సందీప్

టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా సుపరిచితుడు. ఇప్పటికే ఒక రియాల్టీ షోలో విజేతగా నిలిచిన ఇతగాడు.. బిగ్ బాస్ టైటిల్ తనదేనన్న ధీమాతో ఉన్నాడు.

8. శోభాశెట్టి

కార్తీకదీపం మోనికగా అందరికి తెలిసినవారే. సీరియల్ లో నెగిటివ్ రోల్ నటించినప్పటికీ నిజజీవితంలో మాత్రం తాను పాజిటివ్ అని చెబుతుంటారు. బుల్లితెర రమ్యక్రిష్ణగా ఆమెను పిలుస్తుంటారు. ఆమెను పరిచయం చేసే టైంలో నాగార్జున వెరైటీ రూల్ పెట్టారు. ఆమెను ఎవరైనా బ్యూటిఫుల్.. క్యూట్ అని ప్రశంసలు కురిపిస్తే.. వీకెండ్ లో అందుకు శిక్ష ఉంటుందన్న ట్విస్టు ఆసక్తికరంగా మారింది.

9. టేస్టీ తేజ

యూట్యూబర్ గా గుర్తింపు పొందిన ఇతడు.. ఇప్పటికి 150మంది సెలబ్రిటీలతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. తాను వండుతానని చెప్పిన ఇతను.. ఇంట్లోనూ వండుతానని చెప్పాడు.

10. రతిక రోజ్

హీరోయిన్ గా నటించిన ఆమె.. సోషల్ మీడియాలోనూ ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు ఉంది. బిగ్ బాస్ ను పెద్దయ్యగా పేర్కొంటూ మిగిలిన వారికి భిన్నంగా నిలిచారు. డ్యాన్స్ తో పాటు.. మిమిక్రీ చేస్తానంటూ తనపై ఆసక్తిని పెంచే టాలెంట్ గురించి చెప్పుకొచ్చారు.

11. డాక్టర్ గౌతమ్ క్రిష్ణ

డాక్టర్ నుంచి యాక్టర్ ఎలా అయ్యానన్న విషయాన్ని చెప్పుకొచ్చిన ఈ ఆకాశ వీధుల్లో మూవీ నటుడు తన చలాకీతనంతో ఆసక్తిని పెంచాడు.

12. కిరణ్ రాథోడ్

తెలుగు మాత్రమే కాదు తమిళం.. మలయాళం.. హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఆమె తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. తన అందంతో కట్టిపారేసే ఆమె.. ఇంట్లోకి వెళ్లే ముందు కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఫోన్.. కుక్కలు.. ఇంట్లో వాళ్లు లేకుండా ఉన్న పరిస్థితే లేదని.. మొదటిసారి వాటన్నింటికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. హౌస్ నుంచి బయటకు వచ్చే లోపు తెలుగు నేర్చుకుంటానని చెప్పారు.

13. పల్లవి ప్రశాంత్

యూట్యూబర్ గా అందరికి తెలిసిన రైతు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టటం ఆసక్తికరం. మిగిలిన కంటెస్టెంట్లకు భిన్నంగా నాగార్జున ఆసక్తికర టాస్కు ఇచ్చారు. ఒక మిర్చి మొక్కను ఇచ్చి.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చెట్టుకు మిరపకాయలు కాస్తే కొన్ని లాభాలు ఉంటాయన్న ఆఫర్ ఇస్తూ.. ఎండిపోతే మాత్రం శిక్ష తప్పదని హెచ్చరించటం గమనార్హం.

14. అమర్ దీప్

నటుడిగా హౌస్ లోకి అడుగు పెట్టాడు. టాస్కులతో తన సత్తా చాటతానని చెప్పాడు.