Begin typing your search above and press return to search.

వీడియో : తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ రిటర్న్‌ గిఫ్ట్‌

ఇప్పటి వరకు ఎనిమిది సీజన్‌లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్‌ ఈ ఏడాది 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   29 Jun 2025 7:52 PM IST
వీడియో : తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ రిటర్న్‌ గిఫ్ట్‌
X

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు బిగ్‌బాస్ మరోసారి రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్‌లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్‌ ఈ ఏడాది 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. బిగ్‌బాస్‌ తెలుగు హోస్ట్‌ మారుతాడు అంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి, విజయ్ దేవరకొండ మొదలుకుని పదుల సంఖ్యల హీరోల పేర్లు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వినిపించాయి. చివరకు నాగార్జున హోస్ట్‌ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. రెండు రోజుల క్రితం బిగ్‌బాస్‌ సీజన్‌ 9 ను అధికారికంగా ప్రకటించారు. ప్రోమోను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ప్రకటన చేసిన షో నిర్వాహకులు మరో ఆసక్తికర ప్రకటన చేశారు.

బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 9 హోస్ట్‌గా నాగార్జున కన్ఫర్మ్‌ కాగా, కంటెస్టెంట్స్ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో షో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన ప్రోమోతో ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. ఈసారి బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా ఎంట్రీ దక్కబోతోంది. గతంలోనూ సామాన్యులకు చోటు దక్కింది. ఆ సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. పైరవీలు నడిపించిన వారికి మాత్రమే చోటు దక్కిందని, ఆ సమయంలో ఎంపిక సరిగ్గా జరగలేదు అంటూ చాలా మంది విమర్శించారు.

ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు గాను జాగ్రత్తలు జడుతున్నారు. బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌కి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నారు, మీ యొక్క ప్రతిభ ఏంటి అనేది తెలియజేస్తూ ఒక వీడియోను పంపించాలని ఒక లింక్‌ను నిర్వాహకులు ఇచ్చారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 9 ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని, అప్పటి వరకు ఈ ఎంపిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సీజన్‌ కంటే ఈ సీజన్‌ కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో స్పీడ్‌గా ఉన్నారు. ఇదే సమయంలో సామాన్యులకు ఛాన్స్ ఇవ్వనున్నారు.

తాజా ప్రోమోలో తెలుగు బిగ్‌ బాస్‌ను ఇంతటి ఘన విజయాన్ని చేసినందుకు గాను ప్రేక్షకులకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నాం అని, ఆ గిఫ్ట్‌ ఏంటంటే ప్రేక్షకులను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపడం అంటూ నాగార్జున ప్రోమోలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్‌ బాస్‌ సీజన్‌ 9 మరోసారి అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు హౌస్‌లో ఉంటే కచ్చితంగా కంటెంట్‌ బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత సీజన్‌ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. అందుకే సామాన్యులు ఉంటే కాస్త కంటెంట్‌ కొత్తగా ఉంటుందని, హిట్‌ దక్కడం ఖాయం అని అనుకుంటున్నారు. అందుకే బిగ్‌బాస్‌ లో సామాన్యులకు ఛాన్స్‌ ఇవ్వబోతున్నారు.