నువ్వు మా నాన్నంత కావాలి: మనవడికి భువనమ్మ ఆశీర్వాదం
సాధారణంగా.. ఈవెంట్లకు దూరంగా ఉండే నారా భువనేశ్వరి తాజాగా.. తన అన్న, దివంగత హరికృష్ణ మనవడు తారకరామారావు తొలిసారి అరంగేట్రం చేస్తున్న తొలి మూవీకి క్లాప్ కొట్టారు.
By: Tupaki Desk | 12 May 2025 9:38 AMఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. తనకు స్వయానా మనవడి వరసైన నందమూరి జానకిరామ్ కుమారుడు.. తారక రామారావును మనసారా ఆశీర్వదించారు. ``నువ్వు మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి. మా నాన్నలా కీర్తి గడించాలి`` అని కోరుకున్నారు. సాధారణంగా.. ఈవెంట్లకు దూరంగా ఉండే నారా భువనేశ్వరి తాజాగా.. తన అన్న, దివంగత హరికృష్ణ మనవడు తారకరామారావు తొలిసారి అరంగేట్రం చేస్తున్న తొలి మూవీకి క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. తన అన్న మనవడు.. తనకు కూడా మనవడే అయిన తారక రామారావు.. తన తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. తారకరామారావు..(జానకిరామ్ కుమారుడు) తన ఒళ్లోనే పెరిగాడని.. తన చేతి గోరు ముద్దలు తినే పెరిగాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పెద్దవాడై.. సినీరంగంలోకి అడుగు పెట్టడం.. తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ``మా నాన్నంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా`` అని భువనేశ్వరి అన్నారు.
కాగా.. ప్రముఖ దర్శకుడు, అన్నగారి కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైవీఎస్ చౌదరి.. తాజాగా తారకరామారావుతో కొత్త మూవీని నిర్మిస్తున్నారు. ‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్‌పై చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో తొలి ఘట్ట ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి పాల్గొన్నారు. హీరో హీరోయిన్లపై భువనేశ్వరి క్లాప్ కొట్టి తొలిసీన్‌ను ప్రారంభించారు.