మళ్లీ థ్రిల్లర్‌నే నమ్ముకుంటున్న బాలీవుడ్ హీరో
అయితే ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌ని మాత్రం అక్షయ్ చేయలేక ఆ బాధ్యతని యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు అప్పగించాడు.
By: Tupaki Desk | 27 Jun 2025 4:00 AM ISTమలయాళంలో సంచలన విజయం సాధించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ `మణిచిత్రతాళ్`. దీన్ని తమిళంలో సూపర్ స్టార్ రజనీతో `చంద్రముఖి`గా రీమేక్ చేయడం, అది తమిళంతో పాటు తెలుగులోనూ సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇదే మూవీని హిందీతో అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ `భూల్‌బులయ్యా` పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. హీరోగా అక్షయ్‌కుమార్‌కు మరిన్ని ఆఫర్లని అందించి ఖాన్‌ల సరసన నిలబెట్టింది.
అయితే ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌ని మాత్రం అక్షయ్ చేయలేక ఆ బాధ్యతని యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు అప్పగించాడు. దీంతో `భూల్‌బులయ్యా` సీక్వెల్ గా రూపొందిన `భూల్‌బులయ్యా 2`లో అక్షయ్ కాకుండా కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. కోవిడ్ టైమ్‌లో బాలీవుడ్ సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలుస్తున్న వేళ ఈ సినిమాతో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ పరువు కాపాడాడు. రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
అదే ఊపుతో రెండేళ్ల విరామం తరువాత `భూల్‌బులయ్యా 3`ని విడుదల చేశారు. ఇందులోనూ హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించాడు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2024 నవంబర్ 1న విడుదలైంది. `భూల్‌బులయ్యా 2`లో టబు, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తే..`భూల్‌బులయ్యా 3`లో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటించగా, మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో `భూల్‌బులయ్యా 2`కు మించి హీరో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రి..ఇలా నలుగురు ద్విపాత్రాభినయం చేశారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి మరోసారి బాలీవుడ్‌కు ఊపిరులూదింది. దీంతో మళ్లీ దీనికి సీక్వెల్‌గా `భూల్‌బులయ్యా 4`ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా చేసిన సినిమాలేవీ `భూల్‌బులయ్యా` సిరీస్‌ల స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో హీరో కార్తీక్ ఆర్యన్ కన్ను `భూల్‌బులయ్యా 4`పై పడిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు `తుమెరీ మై తేరా మై తేరా తూ మేరా` మూవీలో నటిస్తున్నాడు.
వీటి తరువాత కార్తీక్ ఆర్యన్ `భూల్‌బులయ్యా 4`ని పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. దీనికి ఇండికేషన్ ఇస్తూ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా కార్తీక్ ఆర్యన్ షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. రుహీ బాబా అవతార్‌లో చేతిలో భూతం బొమ్మని పట్టుకుని కనిపిస్తున్న ఫోటోని కార్తిక్ ఆర్యన్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. `భూల్‌బులయ్యా 4` గురించి ఎక్కడా ప్రస్థావించకుండా ఇలా ఫొటోని షేర్ చేయడంతో కార్తీక్ హిట్టు కోసం మళ్లీ హారర్ థ్రిల్లర్‌నే నమ్ముకుంటున్నాడని కామెంట్‌లు చేస్తున్నారు.
