Begin typing your search above and press return to search.

ఆ వివరాలు ఇస్తేనే భోళాశంకర్ టికెట్ ధర పెంపునకు అనుమతి

ఆయన నటించిన తాజా చిత్రం భోళాశంకర్ విడుదల వేళ.. టికెట్ ధరల పెంపు అంశంపై కొర్రీలు పెట్టటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:02 AM GMT
ఆ వివరాలు ఇస్తేనే భోళాశంకర్ టికెట్ ధర పెంపునకు అనుమతి
X

మరో రోజులో విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' మూవీకి సంబంధించి టికెట్ల ధరల్ని పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం పచ్చజెండా ఊపే విషయంలో అనిశ్చితి ఏర్పడింది. దీనికి కారణం చిత్ర యూనిట్ నుంచి తమకు అందిన దరఖాస్తులో వివరాల్ని పూర్తిగా ఇవ్వకపోవటమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ధరల్ని పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వ అనుమతిని కోరుతు ఇచ్చిన దరఖాస్తులో వివరాలు అసంపూర్ణంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఒక సినిమా టికెట్ ధరల్ని పెంచుతూ ప్రభుత్వం అంగీకరించాలంటే కొన్ని నిబంధనల్ని పాటించాల్సి ఉంది. అందులో ముఖ్యంగా ఏపీలో 20 శాతం సినిమాను షూట్ చేసిన వివరాలు.. హీరో.. హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా మొత్తం షూటింగ్ నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు ఉండాల్సి ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. తమకు అందిన వివరాల్లో అవేమీ లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా.. కొన్ని వివరాల్ని మాత్రమే ఇచ్చారని.. మిగిలిన వాటిని ఇస్తే.. టికెట్ పెంపు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

భోళాశంకర్ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. సంక్రాంతి పండుగ వేళ విడుదలైన వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజుల వేడుక హైదరాబాద్ లో జరగటం తెలిసిందే.

ఈ వేడుకలో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి సినీ పరిశ్రమ మీద పడతారేంటి? అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం.. ఈ వ్యాఖ్యల వేళలోనే.. ఆయన నటించిన తాజా చిత్రం భోళాశంకర్ విడుదల వేళ.. టికెట్ ధరల పెంపు అంశంపై కొర్రీలు పెట్టటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.