Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: త్రినేత్రుడే కాల నేత్రుడై పంపిన బ్రహ్మరాక్షసుడే 'భీమా'

ఇందులో భాగంగా ఈరోజు శనివారం హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేసారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 11:00 AM GMT
ట్రైలర్ టాక్: త్రినేత్రుడే కాల నేత్రుడై పంపిన బ్రహ్మరాక్షసుడే భీమా
X

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇతర స్పెషల్ పోస్టర్స్, రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శనివారం హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేసారు.

గోపీచంద్ ను పవర్ ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో ప్రెజెంట్ చేసిన 'భీమా' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రెండున్నర నిమిషాలున్న ఈ వీడియో ద్వారా సినిమా హీరో పాత్ర ఎలా ఉండబోతోందనేది శాంపిల్ గా చూపించారు. అందులో దాదాపు ఒకటిన్నర నిమిషం హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే వాయిస్ ఓవర్ తో గూస్ బమ్స్ తెప్పించారు. అక్కడి నుంచి ఎండ్ వరకూ గోపీచంద్ మార్క్ యాక్షన్ తో ఈ ట్రైలర్ సాగింది.

''శ్రీ మహా విష్ణువు ఆరో అవతారం పరశురాముడు.. తన గండ్ర గొడ్డలితో అనంత సాగరాన్నే వెనక్కి పంపి ఒక అధ్బుతమైన నేలను సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పరమ శివుడే కొలువయ్యాడు. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్ర వీగుతున్నప్పుడు.. వాళ్ళ అంతు కోరి, త్రినేత్రుడే కాల నేత్రుడై కరునే చూపని ఓ బ్రహ్మరాక్షసుడిని పంపాడు" అంటూ గోపీచంద్ పాత్రను పరిచయం చేశారు.

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మాచో స్టార్ ఆకట్టుకున్నారు. అతని బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ అంతా కొత్తగా అనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గోపీచంద్ మరో లుక్ ను కూడా ఈ ట్రెయిలర్ లో మనం చూడొచ్చు. లాంగ్ హెయిర్, కోర మీసాలతో చేతిలో గండ్ర గొడ్డలి పట్టుకొని పరశురాముడి అవతారాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో గోపీ ద్విపాత్రాభినయం చేశారా? లేదా ఒకే పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయా? అనే సందేహాలు కలిగేలా చేశారు. ఇక ఇందులో హీరోయిన్ల పాత్రల గురించి పెద్దగా రివీల్ చేయనప్పటికీ, వారు రెండు షాట్స్ లో కనిపించి తమ ఉనికిని చాటుకున్నారు.

మాస్‌, యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అంశాలు ఉంటాయని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అంతేకాదు దీంట్లో సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయేమో అని ట్రైలర్ చివరలో హింట్ ఇచ్చారు. గోపీచంద్ నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలతో దర్శకుడు హర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ''నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊర్లో స్మశానం కూడా సరిపోదు నా కొడకా.." అంటూ గోపీచంద్ తనదైన శైలిలో చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అలానే గోపీచంద్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయి. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ మాస్టర్స్ ఈ సినిమాలో అధ్బుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు. KGF కంపోజర్ రవి బస్రూర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్‌ రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా వుందని చెప్పాలి.

'భీమా' చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అజ్జు మహంకాళి ఈ సినిమాలో డైలాగ్స్ రాశారు. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.