Begin typing your search above and press return to search.

భీమా Vs గామి: అంతా ఆ శివయ్యకే ఎరుక!

వాటిల్లో గోపీచంద్ నటించిన 'భీమా', విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన 'గామి' చిత్రాలు మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   6 March 2024 4:24 PM GMT
భీమా Vs గామి: అంతా ఆ శివయ్యకే ఎరుక!
X

ఈసారి మహా శివరాత్రి, మహిళా దినోత్సవం రెండూ ఒకేరోజు వస్తున్నాయి. ఈ సందర్భంగా తెలుగులో రెండు క్రేజీ చిత్రాలు, ఒక మలయాళ డబ్బింగ్ సినిమాతో పాటుగా ఒక చిన్న చిత్రం విడుదల కాబోతున్నాయి. వాటిల్లో గోపీచంద్ నటించిన 'భీమా', విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన 'గామి' చిత్రాలు మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ రెండు సినిమాల మధ్య కొన్ని సిమిలారిటీలు ఉండటం విశేషం.

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ డ్రామా 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో రాబోతున్న ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను ఆకట్టుకొని, సినిమాపై ఆసక్తిని కలిగించింది.

ఇలా 'భీమా', 'గామి' చిత్రాలు రెండూ మంచి బజ్ తోనే థియేటర్లలోకి వస్తున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమాల్లో పరమ శివుని ప్రస్తావన ఉండటం యాదృచ్చికమనే చెప్పాలి. రెండు కథల్లోనూ సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వేర్వేరు జోనర్స్ లో తెరకెక్కిన ఈ చిత్రాల్లో దేవుళ్ళు, దైవత్వం, అఘోరాలు, క్షుద్ర పూజలు, మైథలాజికల్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ టచ్ చేసినట్లు తెలుస్తోంది.

'గామి'లో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపిస్తుండగా.. 'భీమా' ట్రైలర్ లో రెండో గోపీచంద్ పాత్ర శివ పూజలు చేస్తున్నట్లు కనిపించింది. రెండు సినిమాలు కూడా విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా థియేటర్ లో ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఈ సినిమాల గురించి ఫిలిం సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలకి సెన్సార్ బోర్డ్ 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. అంటే ఈ సినిమాలు పెద్దలకు మాత్రమే. 2 గంటల 27 నిమిషాల నిడివి ఉన్న 'భీమా'లో.. భారీ యాక్షన్, రక్తపాతం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నాయట. ఇక 'గామి'లో పారలల్ గా నడిచే మరో కథ వల్ల 'A' సర్టిఫికెట్ వచ్చిందని విశ్వక్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పారు. ఈ మూవీ లెన్త్ 2 గంటల 23 నిముషాలు వచ్చింది.

'భీమా' చిత్రం ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో, ట్విస్టులతో చాలా గ్రిప్పింగ్ గా వుంటుందని మేకర్స్ చెపుతున్నారు. 'గామి' స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంటుందని.. సినిమా అంతా ఎంగేజింగ్ గా, తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించేలా వుంటుందని అంటున్నారు. ఇలా చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల అవ్వడం యాదృచ్ఛికమే. మరి వీటిల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.