మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన భీమ్స్
ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుతో పోటా పోటీగా డ్యాన్స్ చేసి గ్లామర్ మెరుపులు మెరిపించే హీరోయిన్ కోసం దర్శకుడు ఇప్పుడు అన్వేషణలో పడ్డాడు.
By: Tupaki Desk | 18 Jun 2025 10:54 AM IST`భోళా శంకర్` నిరాశపరచడంతో ఆలోచనలో పడిన మెగాస్టార్ ఇకపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో వర్క్ చేయాలని డిజైడ్ కావడం తెలిసిందే. ఇందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయింది. కానీ ఒక్క పాట మాత్రం బ్యాలెన్స్‌గా ఉంది. అదే స్పెషల్ నంబర్. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుతో పోటా పోటీగా డ్యాన్స్ చేసి గ్లామర్ మెరుపులు మెరిపించే హీరోయిన్ కోసం దర్శకుడు ఇప్పుడు అన్వేషణలో పడ్డాడు.
వీఎఫ్ ఎక్స్ వర్క్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదాపడుతూ వస్తోంది. అంతే కాకుండా చిరుపై చేయాలనుకున్న స్పెషల్ సాంగ్ కూడా పూర్తి కాలేదు. దీంతో దర్శకుడు వశిష్టతో పాటు డైరెక్షన్ టీమ్, మేకర్స్ కంగారు పడుతున్నారట. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమా కోసం చిరుపై చేయాలనుకున్న స్పెషల్ నంబర్‌కు సంబంధించిన ట్యూన్స్ ఇంత వరకు ఫైనల్ కాలేదని ఇన్ సైడ్ టాక్.
ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్ కోసం ఇప్పటికే కీరవాణి కొన్ని స్పెషల్ ట్యూన్స్ రెడీ చేసి వినిపించారట కానీ అవేవీ అంతగా నచ్చలేదని, మరింత కొత్తగా, యూత్‌లో జోష్‌ని నింపే విధంగా ఉండాలని టీమ్ భావించి ఆ బాధ్యతల్ని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌కు అందించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'బలగం' నుంచి భీమ్స్ పేరు ఇండస్ట్రీలో రీసౌండ్ ఇస్తోంది. అంతే కాకుండా ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరో బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతే కాకుండా దీని తరువాత మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ డ్రామాకు కూడా భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌తో చిరుకు మ్యూజిక్ చేసే బంపర్ ఆఫర్‌ని సొంతం చేసుకున్న భీమ్స్ తాజాగా మరో సారి 'విశ్వంభర'లోని స్పెషల్ సాంగ్‌కు సంగీతం అందించే ఛాన్స్‌ని కొట్టేశాడని తెలుస్తోంది. కీరవాణి ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' రీరికార్డింగ్‌లో బిజీగా ఉండటం వల్ల 'విశ్వంభర' స్పెషల్ సాంగ్ బాధ్యతల్ని టీమ్ భీమ్స్‌కు అప్పగించిందట. అంతే కాకుండా చిరు, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌కు భీమ్స్ అందించిన పాటలు నచ్చి అవకాశం ఇచ్చారని మరో వాదన వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే టీమ్ స్వయంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
