Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహారాజా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   13 Jan 2026 2:33 PM IST
మూవీ రివ్యూ : భర్త మహాశయులకు విజ్ఞప్తి
X

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ

నటీనటులు: రవితేజ- ఆషికా రంగనాథ్- డింపుల్ హయతి- సత్య- సునీల్- వెన్నెల కిషోర్- తారక్ పొన్నప్ప- మురళీధర్ గౌడ్ తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల

కొన్నేళ్లుగా సరైన విజయం లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు మాస్ రాజా రవితేజ. మాస్ సినిమాలతో విసుగెత్తించేసిన ఆయన ‘మాస్ రాజా’ అనే ట్యాగ్ కూడా పక్కన పెట్టేసి ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రమే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. నేను శైలజ.. చిత్రలహరి చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అయినా రవితేజ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసేలా ఉందా? చూద్దాం పదండి.

కథ :

వ్యాపారమే వ్యాపకంగా... తన భార్య బాలమణి (డింపుల్ హయతి) ఆనందమే తన ఆనందంగా భావిస్తూ బతికేస్తుంటాడు రామసత్య నారాయణ (రవితేజ). అలా ఆదర్శ భర్తగా ఉన్న రామ్.., స్పెయిన్ వెళ్లి... అందాల రాశి అయిన మానస (ఆషికా రంగనాథ్) ప్రేమలో పడిపోతాడు. తన పేరు సత్యగా పరిచయం చేసుకొని పొరపాటు చేసేస్తాడు. దీంతో అక్కడ్నుంచి భార్యకు.. ప్రేయసికి తన నిజ స్వరూపం తెలియకుండా మేనేజ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం రామసత్య ఎలా తంటాలు పడ్డాడు? అతని మిత్ర బృందం దాన్ని ఎలా కవర్ చేసే ప్రయత్నం చేసింది? బాలకు.. మానసకు అసలు విషయం తెలిసిందా? తెలిస్తే వారి స్పందనేంటి.. చివరికి రామసత్య పరిస్థితి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

భార్యను అమితంగా ప్రేమించే భర్త అనుకోకుండా మరో అమ్మాయి ప్రేమలో పడితే? తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో పెళ్లి చేసుకుంటే? ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారితే? 80.. 90 దశకాల్లో ఇలాంటి కథలు చాలానే చూశారు తెలుగు ప్రేక్షకులు. అల్లరి మొగుడు.. ఏవండీ ఆవిడ వచ్చింది.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఆవిడా మా ఆవిడే.. ఇలా ఆ తరహా కథలతో వచ్చిన సినిమాలు చాలానే విజయవంతం అయ్యాయి. అప్పట్లో రెండు సొసైటీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న మగాళ్ల సంఖ్య కూడా ఎక్కువ ఉండేది. తర్వాత సొసైటీ మారింది. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తగ్గింది. కానీ పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలు కొనసాగించే వ్యక్తులకేమీ లోటు లేదు. పైన చెప్పుకున్న కథలనే కొంచెం ట్విస్ట్ చేసి.. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా భర్త- భార్య- ప్రేయసి మధ్య స్టోరీ అల్లుకుని.. ట్రెండీ కామెడీతో వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు కిషోర్ తిరుమల. ఐతే కొన్ని ఎపిసోడ్లు.. కామెడీ వరకు మెప్పించినప్పటికీ.. ఒక స్థాయికి మించి ఎంటర్టైన్ చేయలేని బలహీన కథ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని యావరేజ్ సినిమాగా నిలబెట్టింది.

నేను శైలజ.. చిత్రలహరి సినిమాలతో క్లాస్ టచ్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కిషోర్ తిరుమల. ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్ గా కథలను నడిపించడం.. భావోద్వేగాలను పండించడం అతడి శైలి. కానీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అతను రూటు మార్చాడు. ఇందులో తన రైటింగ్.. టేకింగ్ అన్నీ కూడా చాలా లౌడ్ గా అనిపిస్తాయి. సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా కామెడీ సన్నివేశాలను తీర్చిదిద్దుకున్న అతను ఓవర్ ద టాప్ స్టయిల్లో ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల ఆ కామెడీ బాగానే వర్కవుట్ అయింది కానీ.. కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పండలేదు. భార్య.. ప్రేయసి మధ్య ఇరుక్కుపోయి మేనేజ్ చేయలేక సతమతమయ్యే పాత్రలో రవితేజ.. అతణ్ని కాపాడడానికి ప్రయత్నించే మిత్రులుగా వెన్నెల కిషోర్.. సునీల్ ఒక దశ వరకు నవ్వించగలిగారు కానీ.. తర్వాత సన్నివేశాలు రొటీన్ గా.. రిపిటీటివ్ గా తయారవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది.

‘భర్త మహాశయులకు విజ్ఙప్తి’లో ప్రథమార్ధం మంచి ఊపులోనే సాగుతుంది. కథను నేరుగా స్పెయిన్లో మొదలు పెట్టిన దర్శకుడు మొదటి 20 నిమిషాలు మానసగా ఆషికా రంగనాథ్ అందాల్లో రామసత్యతో పాటు, ప్రేక్షకుడిననీ ముంచేస్తాడు. మానసకు అసిస్టెంటుగా సత్య చేసే కామెడీ ఒకవైపు మెప్పిస్తుంటే... మానస సొగసుల్లో రామసత్య రొమాన్స్ ఆడియాన్ ని ఎంగేజ్ చేస్తాయి. అలా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు... హైదరాబాద్ లో రామసత్య భార్య బాలామణిని చూపించి... పాత్రల మధ్య కాన్ఫ్లిట్ ని రైజ్ చేశాడు. భార్యా భర్తల మధ్యలోకి ప్రేయసి రావడంతో అక్కడి నుంచి హీరో పడే తంటాల మధ్య.. కన్ఫ్యూజింగ్ కామెడీతో సినిమాను నడిపించడానికి ప్రయత్నించాడు కిషోర్. కానీ ఒక దశ దాటాక కామెడీ వర్కవుట్ కాలేదు. ఇంటర్వెల్లోనే కథపై ఒక అంచనాకు వచ్చిన ప్రేక్షకుడిని తర్వాత ఆకట్టుకోవడం కష్టమైన పని. ఈ విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. కథ ఇక అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగే రెండు మూడు సన్నివేశాలు ఫరవాలేదనిపిస్తాయి. డీజే మిక్స్ సాంగ్ అసందర్భంగా అనిపించినా.. అది ప్రేక్షకుల్లో జోష్ తెస్తుంది. ద్వితీయార్ధంలో డంబ్ స్మాష్ ఎపిసోడ్ ఒక్కటి కొంచెం నవ్వించింది. సెకండాఫ్ లో రంగప్రవేశం చేసిన తారక్ పొనప్ప పాత్ర పెద్దగా పండలేదు. క్లైమాక్స్ లో ఎమోషన్స్ లైట్ టచ్ చేసి... సరదాగా కథను ముగించారు. పతాక సన్నివేశాలు సాధారణంగా అనిపించడంతో సినిమా మీద కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో రవితేజను చూడడం ఈ సినిమాతో అత్యంత రిఫ్రెషింగ్ గా అనిపించే విషయం. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా మెరుగు కూడా. కానీ వినోదం ఓ మోస్తరు స్థాయిని మాత్రం మించలేకపోయింది.

నటీనటులు:

రవితేజ తన రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా కాస్త కొత్తగా చేసే ప్రయత్నం చేశాడు. తన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. హీరోయిజం పూర్తిగా పక్కనపెట్టేసి.. మామూలు మగాడి పాత్రలో ఒదిగిపోవడానికి రవితేజ బాగానే ప్రయత్నించాడు. హీరోయిన్లు ఇద్దరిలో ఆషికా రంగనాథ్ బాగా హైలైట్ అయింది. తన గ్లామర్ సినిమాకు పెద్ద అసెట్. ఆషికా హావభావాలు కూడా ఆకట్టుకుంటాయి. మున్ముందు ఆషికాను మరిన్ని సినిమాల్లో చూడొచ్చు. డింపుల్ హయతి నటన సోసోగా అనిపిస్తుంది. రెండు పాటల్లో ఆమె కూడా గ్లామర్ విందు చేసింది. సత్య కామెడీ సినిమాలో మేజర్ హైలైట్. సునీల్.. వెన్నెల కిషోర్ కూడా ఓ మోస్తరుగా నవ్వించారు. మురళీధర్ గౌడ్ ఓకే. తారక్ పొనప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

సాంకేతిక వర్గం:

భీమ్స్ సిసిరోలియా పాటలు బాగున్నాయి. సినిమా శైలికి తగ్గ పాటలతో అతను మెప్పించాడు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అతడి వర్క్ మరోసారి సోసోగానే సాగింది. ఆర్ఆర్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కిషోర్ తిరుమలకు రచయితగా- దర్శకుడిగా ఓ మోస్తరు పనితనం చూపించాడు. కథ తన శైలిలోనే ఉన్నప్పటికీ.. నరేషన్లో అతను రూటు మార్చాడు. మాస్ అండ్ లౌడ్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూశాడు. అతను కథలోంచి పక్కకు వెళ్లకుండా... కామెడీ పండించే ప్రయత్నం చేయడం మెచ్చుకోదగ్గదే. సెకండాఫ్ ఆరంభంలో కాస్త తడబడినా.. ప్రథమార్ధంతో అతను మెప్పించాడు. ద్వితీయార్ధాన్ని.. పతాక సన్నివేశాలను ఇంకా బిగితో తీర్చిదిద్దుకుని ఉంటే బాగుండేది.

చివరగా: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఓ మోస్తరు వినోదం

రేటింగ్- 2.5/5