ఇండస్ట్రీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ హీరో సినిమాటోగ్రాఫర్ మృతి!
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నెల్లూరు నుంచి హైదరాబాదుకి కారులో ప్రయాణిస్తున్న సమయంలో అవుటర్ రింగ్ రోడ్డుపై బొంగ్లూరు గేట్ సమీపంలో.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By: Madhu Reddy | 11 May 2026 10:23 AM ISTగత వారం రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస రోడ్డు ప్రమాదాలు అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న మలయాళ నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ప్రస్తుతం ఆయన భార్య హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. ఇక మరొకవైపు ప్రముఖ హీరో నటుడు జీవ తండ్రి , నిర్మాత ఆర్.బి చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఇప్పుడు మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో యువ హీరోతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నెల్లూరు నుంచి హైదరాబాదుకి కారులో ప్రయాణిస్తున్న సమయంలో అవుటర్ రింగ్ రోడ్డుపై బొంగ్లూరు గేట్ సమీపంలో.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కంటైనర్ లారీ వీరి కారుని ఢీ కొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఢీ కొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండడంతో హీరో భరత్ కాంత్ సినిమాటోగ్రాఫర్ తిలోక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
యువ హీరో భరత్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన టాలెంట్ సినిమాలో హీరోగా నటించి తన నటనతోనే కాదు మంచి హ్యాండ్సం లుకింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తెలుగు , హిందీ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఈయన ఇప్పుడు హీరోగా మరికొన్ని ప్రాజెక్టులు చేతిలో ఉండగానే రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెంది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు..
ఇక సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ విషయానికి వస్తే పలు తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ విషాద ఘటన తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రతిభావంతులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు ఎన్ని సూచనలు చేసినా సరే.. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ప్రమాదాలు ఎంతోమంది జీవితాలలో చీకటి నింపుతున్నాయి. మరి ఇప్పటికైనా ప్రయాణికులు వాహనాన్ని నడిపే ముందు.. ముందు , వెనుక జాగ్రత్తగా చూసి వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు.
