Begin typing your search above and press return to search.

భరతనాట్యం ట్రైలర్.. ఎలా ఉందంటే..

యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 March 2024 2:27 PM GMT
భరతనాట్యం ట్రైలర్.. ఎలా ఉందంటే..
X

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కొడుకు సూర్య తేజ ఏలే హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న చిత్రం భరతనాట్యం. దొరసాని ఫేమ్ దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్ గా నటిస్తోంది. యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు. గంగవ్వ, కృష్ణుడు, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలోకి రానుంది. తాజాగా ప్రమోషన్ల స్పీడ్ పెంచారు భరతనాట్యం మేకర్స్. శనివారం ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలో ఎస్ ఐ అజయ్ ఘోష్.. ఏం చేస్తుంటావ్ అని హీరోను అడగ్గా.. డిపార్ట్మెంట్ సార్.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని చెబుతారు. ఈ డైలాగ్ తోనే ట్రైలర్ మొదలవుతుంది. సినిమా పరిశ్రమలో దర్శకుడు అవ్వాలనుకునే ఓ యువకుడి కథగా సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమైనప్పుడు, తన సమస్యలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు వ్యూహాలు పన్నుతారు హీరో.

మొత్తానికి సూర్య తేజ ఫస్ట్ మూవీ కోసం సరైన స్టోరీ ఎంచుకున్నారని చెప్పవచ్చు. యాక్టింగ్ విషయంలో మంచి మార్కులు కొట్టేసేటట్లు కనిపిస్తున్నారు. హీరో చుట్టూ తిరిగే దరిద్రం ఇంకెవరి చుట్టూ తిరగదన్నట్లు చేసిన క్యారెక్టర్ డిజైనింగ్ బాగుంది. గుండాలు, విలన్ల మధ్య వచ్చే ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. వైవా హర్ష తన డైలాగ్స్ తో అదరగొట్టారు. ప్రముఖ రైటర్, యాక్టర్ హర్షవర్ధన్ విలనిజం ఆసక్తి పెంచుతోంది.

ఓవైపు కామెడీ, మరోవైపు కమర్షియల్ అంశాలతో ఉన్న ట్రైలర్.. సినిమాపై మూవీ లవర్స్ లో అంచనాలు పెంచేసింది. లాస్ట్ లో సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్ అంటూనే భరత నాట్యం అంటే కేవలం నాట్యం కాదు అని వచ్చిన డైలాగ్ క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే సూర్యతేజ.. స్టోరీ, స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా చేపట్టారు. మరి ఫస్ట్ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.