డైరెక్టర్ మెగా వివాదంపై మనోజ్ రియాక్షన్.. ఏమన్నారంటే..
ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లలో భైరవం టీమ్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
By: Tupaki Desk | 24 May 2025 3:55 PM ISTఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కానున్న భైరవం చిత్రం ఓవైపు ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంటే, మరోవైపు కొన్ని వివాదాలు సినిమా చుట్టూ ఏర్పడుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్, పాటలతో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గరుడన్'కు రీమేక్ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా పలు మార్పులు చేశారు.
ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లలో భైరవం టీమ్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. అలాగే సినిమాకు ఓ వర్గం నుంచి బాయ్‌కాట్ ట్రెండ్ ఎదురవుతోంది. దీంతో సోషల్ మీడియాలో 'భైరవం'ను బహిష్కరించాలంటూ ట్రెండ్లు మొదలయ్యాయి. అయితే మూవీ యూనిట్ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతూ, సినిమా హిట్ అవుతుందని ధీమాగా ప్రచారం చేస్తోంది.
అలాగే దర్శకుడు విజయ్ గతంలో మెగాస్టార్ చిరంజీవిపై నెగిటివ్ గా మర్ఫ్ డ్ ఫోటో పోస్ట్ చేసినట్లు రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇవ్వగా ఇప్పుడు హీరో మనోజ్ కూడా వివరణ ఇచ్చారు. మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ… ‘‘సినిమాకి కులం, జాతులు అనేవి ఉండవు. సినిమాని సినిమాలా చూడాలి. ఆధార్ కార్డులో కులం చూసి ఎవరూ అభిమానించరు. రాజకీయ రంగుల కళ్లతో సినిమాని చూడొద్దు. మా డైరెక్టర్ విజయ్ కనకమేడల పవన్ కళ్యాణ్ వీరాభిమాని.
ఆయనపై ఉన్న అభిమానంతోనే ఏలూరులో మాట్లాడారు. అయితే అది తప్పుగా అర్థమై ట్రోలింగ్‌కు దారితీసింది. 2011లో చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కానీ ఆ పోస్ట్ నిజంగా ఆయనే చేశారా? లేక హ్యాక్ అయిందా? స్పష్టతలేదు’’ అంటూ వివరణ ఇచ్చారు. అలాగే.. ‘‘ఒక పవన్ కళ్యాణ్ అభిమాని మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఇది లాజిక్‌కే రాదు. అంతా ఒక అపోహ వల్ల జరుగుతోంది.
సినిమా కోసం మా టీమ్ ఎంతో కష్టపడింది. నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతల శ్రమని ఇలా బాయ్‌కాట్ ట్రెండ్‌తో దెబ్బతీయడం సబబు కాదు. మేం సినిమా వాళ్లం. రాజకీయాలను కనెక్ట్ చేయవద్దు. అలాంటి విషయాల్లోకి మమ్మల్ని లాగొద్దు. భైరవం ఒక మంచి సినిమా. దయచేసి ఆదరించండి’’ అని మనోజ్ విజ్ఞప్తి చేశారు.
ఈ వివరణతో భైరవం చుట్టూ ఏర్పడిన నెగటివ్ వాతావరణం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, గీచ్చమాకు లాంటి పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ అవతారం, నారా రోహిత్ ఇంటెన్స్ క్యారెక్టర్, మంచు మనోజ్ డిఫరెంట్ లుక్ సినిమాకు స్పెషల్ హైలైట్స్‌గా నిలవనున్నాయి. మరి ఈ వివాదాల నడుమ, భైరవం బాక్సాఫీస్ వద్ద ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
