ఎలా చూసినా ఇది అందరికీ రీలాంచే!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం.
By: Tupaki Desk | 19 May 2025 11:00 AM ISTబెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం. ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి దారుణమైన డిజాస్టర్ అందుకున్న తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. ఒక్కడు మిగిలాడు సినిమాతో ఆఖరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు మనోజ్ 9 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇస్తున్న సినిమా. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30వ తేదీన రీలీజ్ కానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసి అందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ను నిర్వహించింది. ఈ ట్రైలర్ లాంచ్ లో సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ముగ్గురు హీరోలు భైరవంపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు వారి మాటల్లో తెలియచేశారు. భైరవం సినిమా తన కెరీర్లో ఎంతో స్పెషల్ సినిమా అని, బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్టును తన దగ్గరకు తీసుకొచ్చారని, విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిశాక సినిమాపై చాలా నమ్మకమొచ్చిందని చెప్పాడు. ఈ మూవీలో మనోజ్, సాయి కూడా నటిస్తున్నారని తెలిసి సంతోషమేసిందని చెప్పిన నారా రోహిత్, మనోజ్ తనకు చిన్నప్పటి నుంచే ఎంతో క్లోజ్ అని చెప్పాడు.
మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడులో సినిమాలో నారా రోహిత్ ఇవ్వగా, ఇప్పుడు యాదృచ్ఛికంగా నారా రోహిత్ నటిస్తున్న సినిమాతోనే మంచు మనోజ్ కంబ్యాక్ ఇవ్వడం విశేషం. విజయ్ నా సొంత రక్తం లాంటి వాడని చెప్పిన మనోజ్, అతను కచ్ఛితంగా భైరవంలో నన్ను తీసుకోవాలని అనుకున్నాడని, విజయ్ కు ఉన్న హిట్స్ కు తానింకా స్టార్ యాక్టర్లను కూడా తీసుకోవచ్చు కానీ తాను మాత్రం నన్ను సెలెక్ట్ చేసుకున్నాడని చెప్పాడు.
శివయ్యను ఎవరైనా పేరు పెట్టి శివయ్యా అంటే రాడని, మనం అతన్ని మనస్పూర్తిగా తలచుకుని భక్తితో పిలిచినప్పుడు మాత్రమే మనల్ని ఆశీర్వదించాడనికి వస్తాడని, ఆ శివయ్యే డైరెక్టర్, నిర్మాత రూపంలో వచ్చారని తాను నమ్ముతున్నట్టు కూడా మనోజ్ చెప్పాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు లాంటోడని చెప్పిన మనోజ్, అతనికి అన్నయ్యగా తానెప్పుడూ అండగా ఉంటానని, రోహిత్ ఫ్యామిలీ లాంటోడని, ఈ సినిమాలో వారిద్దరూ నెక్ట్స్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చారని, భైరవం తప్పకుండా తామందరికీ ఓ మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నట్టు మనోజ్ అభిప్రాయపడ్డాడు.
భైరవం ట్రైలర్ లో చూసింది చాలా తక్కువని, సినిమాలో చూడాల్సింది చాలానే ఉందని బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పాడు. విజయ్ ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడని, అతను తీసి నాంది, ఉగ్రం సినిమాలు తనకెంతో నచ్చాయని చెప్పిన శ్రీనివాస్, భైరవం సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ తో పాటూ సాలిడ్ మేకింగ్ ఉంటుందని, భైరవం తర్వాత విజయ్ స్టార్ డైరెక్టర్ల లీగ్ లోకి వెళ్తాడని చెప్పాడు. నారా రోహిత్ ఈ సినిమాలో నటించడమే సినిమాకు మొదటి విజయమని, ఆయనెంతో నిజాయితీగా ఉంటాడని, అతను మాతో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని, మనోజ్‌ను ఎంతో గౌరవిస్తానని, అతని వర్క్ కు తాను పెద్ద ఫ్యాన్‌ని అని, వారిద్దరి సపోర్ట్ భైరవంకు చాలా ప్రధానమైనదని, ఏ రకంగా చూసిన ఈ సినిమా తమ ముగ్గురుకి రీలాంచ్ లా అనిపిస్తుందని శ్రీనివాస్ అన్నాడు.
