లైన్ లో కనిపించని భాగ్య శ్రీ బోర్సే!
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లైనప్‌లో భాగ్యశ్రీ పేరు పెద్దగా వినిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Srikanth Kontham | 28 Aug 2026 12:13 PM ISTఅతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న కథానాయికలలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. గ్లామర్ ..నటనతో తొలి సినిమా నుంచే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన భామ, ఒకానొక దశలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా కనిపించింది. అంతకుముందు ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేతిలో ఉండేది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లైనప్‌లో భాగ్యశ్రీ పేరు పెద్దగా వినిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల విడుదలైన `లెనిన్` చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా అందులో భాగ్యశ్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా విజయం సాధించిన తర్వాత సాధారణంగా కథానాయికలకు కొత్త ఆఫర్ల వరద పారుతుంటుంది. కానీ `లెనిన్` తెచ్చిన పాజిటివ్ వైబ్ తర్వాత కూడా భాగ్యశ్రీకి తెలుగులో కొత్తగా పెద్దగా అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకు వెలువడలేదు. ప్రస్తుతం భాగ్య శ్రీ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ కోలీవుడ్‌కు చెందిన `సేయాన్` మాత్రమే. తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది.
అధికారికంగా ఆమె ఖాతాలో ఉన్నది ఒక్క ప్రాజెక్టే కావడంతో టాలీవుడ్ నుంచి ఆమెకు సరైన ఆఫర్లు రావడం లేదా లేక ఆమె స్వయంగా పాత్రల ఎంపికలో జాగ్రత్త వహిస్తోందా? ఈ క్రమంలో వచ్చిన సినిమాలను తిరస్కరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమలో సక్సెస్ ఎంత ముఖ్యమో? దాన్ని నిలబెట్టుకోవడానికి సరైన ప్లానింగ్ ప్రాజెక్ట్‌ల ఎంపిక అంతకంటే ముఖ్యం. `లెనిన్` సక్సెస్ సాధించినప్పటికీ దాన్ని కెరీర్ వేగానికి అనుకూలంగా మలచుకోవడంలో భాగ్యశ్రీ కొంత నెమ్మదించినట్లే కనిపిస్తోంది.
టాలీవుడ్‌లో కొత్త భామల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఒకసారి గ్యాప్ వస్తే మళ్లీ రేసులోకి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే భాగ్యశ్రీ బోర్సే తదుపరి సినిమాల విషయంలో తొందర పడకుండా పవర్‌ఫుల్ , ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్లు వినబడుతోంది. విభిన్నమైన కథాంశాలతో వచ్చే ప్రాజెక్ట్‌ల కోసమే అమ్మడు వేచి చూస్తోందని.. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
మరో విచిత్రం ఏంటంటే? అమ్మడు ఫెయిల్యూర్స్ లో ఉన్న సమయంలోనే ఎక్కవ అవకాశాలు వచ్చేవి. విజయాలు లేకపోయినా? కొత్త ఛాన్సులు ఎలా అందుకుంటుందనే ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తమయ్యేది. కానీ లెనిన్ లాంటి యావరేజ్ హిట్ ఉన్నా? అమ్మడి ఖాతాలో టాలీవుడ్ నుంచి కొత్త ఛాన్సులు రకపోవడమే వింతగా ఉంది. మరి ఈ గట్టు ఎప్పుడు వీడుతుందో చూడాలి.
