Begin typing your search above and press return to search.

ఆంధ్ర కింగ్‌ తాలూకా అమ్మాయికి పెద్ద ఛాన్స్‌..!

ఈ అమ్మడు మొదటి సినిమాతోనే దారుణమైన డిజాస్టర్‌ను చవిచూసినప్పటికీ తన అందంతో టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకుంది.

By:  Ramesh Palla   |   21 Aug 2026 12:00 AM IST
ఆంధ్ర కింగ్‌ తాలూకా అమ్మాయికి పెద్ద ఛాన్స్‌..!
X

మిస్టర్‌ బచ్చన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే దారుణమైన డిజాస్టర్‌ను చవిచూసినప్పటికీ తన అందంతో టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకుంది. రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఈ అమ్మడు విజయ్‌ దేవరకొండ మూవీ 'కింగ్డమ్‌' లో నటించే అవకాశం దక్కించుకుంది. విజయ్ దేవరకొండ కి మంచి జోడీ అనిపించుకుంది. ఆ సినిమా సైతం డిజాస్టర్‌గా నిలిచింది. కింగ్డమ్‌ తర్వాత భాగ్యశ్రీ మళ్లీ తెలుగులో కనిపించే అవకాశం ఉందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ భాగ్యశ్రీ అందం ముందు ఆ ఫ్లాప్స్ నిలువలేక పోయాయి. రామ్‌ కి జోడీగా ఆంధ్ర కింగ్‌ తాలూకా సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమాలోనూ అందంతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఫలితం విషయంలోనూ భాగ్యశ్రీ కి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది.

రామ్‌ ఆంధ్ర కింగ్‌ తాలూకా మూవీ హీరోయిన్‌...

ఆంధ్ర కింగ్‌ తాలూకా తర్వాత అఖిల్‌తో వచ్చిన 'లెనిన్‌' సినిమాతో భాగ్యశ్రీ మొదటి కమర్షియల్‌ హిట్‌ను దక్కించుకుంది. రెండు మూడు ఏళ్లుగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి లక్కీగా 2026లో ఆ హిట్‌ లభించింది. దాంతో వెంటనే టాలీవుడ్‌లో ఇబ్బడి ముబ్బడిగా సినిమా ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ ఈ అమ్మడు టాలీవుడ్‌లో కంటే ముందు బాలీవుడ్‌లో సినిమా ఆఫర్‌ను దక్కించుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ మీడియా సంస్థ ఈ విషయాన్ని తన కథనంలో పేర్కొనడం జరిగింది. భూషన్‌ కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపిక అయిందని, ఆ సినిమాలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ హీరోగా కనిపించబోతున్నట్లుగానూ ఆ కథనంలో పేర్కొన్నారు. ఆషికి 2, మలంగ్‌, లూడో చిత్రాల తర్వాత నిర్మాత భూషన్‌ కుమార్‌, ఆధిత్య రాయ్‌ కపూర్‌ జత కట్టడం ఇది ఐదో సారి. ఈ హిట్‌ కాంబోలో రాబోతున్న సినిమా కోసం భాగ్యశ్రీ ని హీరోయిన్‌గా ఎంపిక చేయడం విశేషం.

ఆదిత్యరాయ్‌ కపూర్‌కి జోడీగా భాగ్య శ్రీ బోర్సే...

ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శకుడు మిలాప్ మిలన్ జవేరి దర్శకత్వం వహించబోతున్నాడు. గత ఏడాది ఏక్ దీవానే కి దీవానియత్, మస్తీ 4, ఈ ఏడాది తేరా యార్ హూన్ మై సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మిలాప్‌ జవేరి దర్శకత్వంలో రూపొందబోతున్న మ్యూజికల్‌ అండ్‌ ఇంటెన్స్‌ వయెలెంట్‌ లవ్‌ స్టోరీ మూవీలో ఆదిత్యరాయ్‌ కపూర్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా కనిపించబోతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో మళ్లీ లవ్‌ స్టోరీలకు మంచి ఆధరణ లభిస్తోంది. మంచి కంటెంట్‌తో తీస్తే తప్పకుండా ఆధరిస్తారు అనే అభిప్రాయం ఉంది. అందుకే స్టార్‌ ప్రొడ్యూసర్స్‌ సైతం లవ్‌ స్టోరీల వెనుక పడుతున్నారు. అందులో భాగంగానే ఆదిత్యరాయ్‌ కపూర్‌, భాగ్యశ్రీ బోర్సేలతో నిర్మాత భూషన్‌ కుమార్‌ ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ప్లాన్‌ చేశాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

రవితేజ మూవీ మిస్టర్‌ బచ్చన్‌తో ఎంట్రీ...

మహారాష్ట్రాలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జన్మించిన భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలోని లాగోస్‌లో ఏడు ఏళ్లు విద్యను అభ్యసించింది. ఆ తర్వాత మోడలింగ్‌ పై ఆసక్తితో ముంబైలోని ఒక బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో జాయిన్‌ అయ్యి మోడలింగ్‌ పై శ్రద్ద పెట్టింది. 2023లోనే యారియాన్‌ సినిమాతో భాగ్యశ్రీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఆ సినిమా పెద్దగా భాగ్యశ్రీ కి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత మరో హిందీ సినిమా అయిన చందు ఛాంపియన్‌లోనూ నటించింది. అయితే ఆ సినిమా సైతం భాగ్యశ్రీని హిందీలో హీరోయిన్‌గా నిలబెట్టడంలో సఫలం కాలేదు.

బాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ, మోడలింగ్‌ చేస్తున్న సమయంలో భాగ్యశ్రీకి లక్కీగా రవితేజకు జోడీగా మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. టాలీవుడ్‌లో 2024లో అడుగు పెట్టిన భాగ్యశ్రీ ఈ ఏడాది హిట్‌ కొట్టింది. టాలీవుడ్‌లో బిజీ అవుతుందని భావిస్తున్న సమయంలో హిందీలో ఆదిత్య రాయ్‌ కపూర్‌కి జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ బాలీవుడ్‌ మూవీతో హిట్‌ కొడితే భాగ్యశ్రీ తిరిగి టాలీవుడ్‌లో సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.