CM NTR .. ఫ్యాన్స్ మళ్లీ మొదలెట్టారుగా
కర్ణాటక రాజధాని బెంగళూరు వీధులు మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల నినాదాలతో హోరెత్తాయి.
By: Sivaji Kontham | 8 March 2026 1:07 PM ISTకర్ణాటక రాజధాని బెంగళూరు వీధులు మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల నినాదాలతో హోరెత్తాయి. ఇటీవల బెంగళూరులోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిని సందర్శించిన ఎన్టీఆర్‌కు అక్కడి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. కేవలం స్వాగతంతోనే సరిపెట్టకుండా CM NTR అంటూ రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని భారీ ఎత్తున నినాదాలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానుల మనసులో ఆయనను రాజకీయ నాయకుడిగా చూడాలనే కోరిక ఇంకా బలంగానే ఉందని అర్థమవుతోంది.
బెంగళూరు ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ హంగామా చూస్తుంటే ఎన్టీఆర్ కెరీర్ మైలురాయి అయిన `సింహాద్రి` సినిమాలోని కొన్ని సీన్లు గుర్తుకు వచ్చాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కర్ణాటక వ్యాప్తంగా ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ఆయన తల్లి ద్వారా అక్కడ ఉన్న స్థానిక సంబంధం, కన్నడ భాషను అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఎన్టీఆర్‌ను కన్నడిగులకు మరింత చేరువ చేశాయి. ఈ కారణంగానే ఆయన ఎప్పుడు బెంగళూరు వెళ్లినా అక్కడి జనం బ్రహ్మరథం పడుతుంటారు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని.. ఆయన ముఖ్యమంత్రి కావాలని అభిమానులు పెద్ద ఎత్తున కోరుకునేవారు. గత రెండు ఎన్నికల సమయంలో ఈ హడావిడి కొంత తగ్గినా.. అంతకుముందు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండేది కాదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత బెంగళూరు సాక్షిగా `సీఎం ఎన్టీఆర్` అనే నినాదం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఫ్యాన్స్ ఈ నినాదాన్ని ఇకపైనా గట్టిగా కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ఎన్టీఆర్ మాత్రం గత కొంతకాలంగా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. వివాదాలకు పోకుండా, తన వ్యక్తిగత అభిప్రాయాలను రాజకీయం చేయకుండా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందనే చిన్న సిగ్నల్ కూడా ఆయన ఇవ్వడం లేదు. తన పూర్తి సమయాన్ని , దృష్టిని కేవలం ఒక నటుడిగా వెండితెరపై తన ప్రభావాన్ని పెంచుకోవడానికే కేటాయిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రస్తుతం `కెరీర్ ఫస్ట్` అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా `డ్రాగన్` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి న ప్రతి అప్ డేట్ చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమనిపిస్తోంది.
ఎట్టకేలకు మరోసారి సీఎం నినాదాలు చూస్తుంటే.. అభిమానులు ఆయనను ఒక ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారని అర్థమవుతోంది. అయినా తారక్ మాత్రం తన నటనతో ప్రపంచాన్ని జయించే పనిలో ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఆయన క్రేజ్ మాత్రం రెండు రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరిస్తోంది.
