Begin typing your search above and press return to search.

ర్యాష్ డ్రైవింగ్ తో బుక్ అయిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్!

తాజాగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయటమే కాదు.. తన ర్యాష్ డ్రైవింగ్ తో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ మీదకు దూసుకెళ్లేలా చేసిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   14 May 2025 10:09 AM IST
Tollywood Actor Bellamkonda Sreenivas in Trouble for Rash Driving
X

స్టార్ స్టేటస్ సొంతం చేసుకునే సినీ నటులు కానీ సెలబ్రిటీలు కానీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటకు వస్తే.. సాధారణ పౌరులకు మించిన క్రమశిక్షణ.. ఓర్పు.. సహనం చాలా అవసరం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తేజరిగే నష్టం భారీగా ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

తాజాగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయటమే కాదు.. తన ర్యాష్ డ్రైవింగ్ తో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ మీదకు దూసుకెళ్లేలా చేసిన వైనం షాకింగ్ గా మారింది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న సదరు పోలీస్ కానిస్టేబుల్ తప్పుకోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్టు కాలనీలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నివాసం ఉందన్న సంగతి తెలిసిందే.

మంగళవారం తన ఇంటికి వెళ్లే క్రమంలో రాంగ్ రూట్ లో తన కారును వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మీదకు శ్రీనివాస్ కారు దూసుకెళ్లింది. అయితే.. అప్రమత్తంగా ఉన్న పోలీసు పక్కకు తప్పుకోవటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. దీంతో.. కారును నిలిపిన కానిస్టేబుల్.. బెల్లంకొండ శ్రీనివాస్ తీరును ప్రశ్నించగా.. అతను దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాంగ్ రూట్ లో రావటం ఒక తప్పు అయితే... ర్యాష్ డ్రైవింగ్ రెండో తప్పు. ఈ క్రమంలో ఒక పోలీస్ మీద కు కారు వెళ్లటం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసినా.. ఉల్టాగా సదరు కానిస్టేబుల్ మీద విరుచుకుపడిన వైనాన్ని తప్పు పడుతున్నారు. జరిగిన సంఘటన గురించి సదరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం సోషల్ మీడియాలో రావటంతో నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ తీరును తప్పు పడుతున్నారు.