సీఎంల నుంచి సెలెబ్రిటీల దాకా.. బండ్ల గణేష్ లెవల్ వేరే లెవల్ అంతే..
సినిమా ఇండస్ట్రీలో రూ. 100 కోట్లు, రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు తీసిన నిర్మాతలు చాలామందే ఉన్నారు. రాజకీయాల్లో కోట్లు గడించి.. హోదాలు అనుభవించిన నాయకులకూ కొదవేం లేదు.
By: A.N.Kumar | 17 Aug 2026 11:14 PM ISTసినిమా ఇండస్ట్రీలో రూ. 100 కోట్లు, రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు తీసిన నిర్మాతలు చాలామందే ఉన్నారు. రాజకీయాల్లో కోట్లు గడించి.. హోదాలు అనుభవించిన నాయకులకూ కొదవేం లేదు. కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో లేదా ఒక్క శుభలేఖతో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను.. టాలీవుడ్ అగ్ర హీరోలను, దిగ్గజ దర్శకులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎంతమందికి సాధ్యం? మన 'ఈశ్వర.. పవనేశ్వర..' బండ్ల గణేష్‌కు తప్ప ఇది వేరే ఎవరికీ సాధ్యం కాదేమో.. తాజాగా జరిగిన ఆయన కుమార్తె వివాహ వేడుక చూశాక సోషల్ మీడియా అంతటా ఒకటే మాట మారెమోగుతోంది. "గణేష్ భయ్యా.. నీ నెట్‌వర్క్ రేంజ్ వేరే లెవల్ అంతే!"
చిన్న పాత్రల నుంచి.. 'పిలిస్తే పలికే' కనెక్షన్ల దాకా!
బండ్ల గణేష్ ప్రయాణం ఒక విచిత్రమైన రోలర్‌కోస్టర్ రైడ్. పరిశ్రమలోకి చిన్న నటుడిగా అడుగుపెట్టి, కామెడీ పాత్రలతో అలరించి.. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్', 'బాద్షా', 'టెంపర్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో అగ్ర నిర్మాతగా చక్రం తిప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్ మైక్ పట్టుకుని "మేం పవర్‌లోకి వస్తున్నాం.. బ్లేడుతో పీక కోసుకుంటా" అంటూ టీవీ స్టూడియోల్లో చేసిన హడావుడి నెటిజన్లు ఇప్పటికీ మర్చిపోలేరు. రాజకీయాల్లో పెద్ద పదవి దక్కలేదు.. ప్రొడక్షన్ వేసి ఏళ్లు గడిచిపోయాయి.. అయినా సరే ఆయన క్రేజ్ గానీ, ఆయనకున్న 'కనెక్షన్స్' గానీ ఎక్కడా తగ్గకపోవడం అసలైన మ్యాజిక్..
సీఎంలు, స్టార్ల కలయిక.. ఇది పెళ్లా? స్టేట్ ఈవెంటా?
నిన్నటి వివాహ వేడుకలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే కనిపిస్తుంటే మరోపక్క సినిమా ఇండస్ట్రీలోని బిగ్ షాట్స్, వివిధ పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు ముచ్చటించుకుంటున్నారు. సాధారణంగా పొలిటికల్ మైలేజ్ లేదా సినిమాల బిజినెస్ లాభాల కోసం పరిచయాలు పెంచుకుంటారు. కానీ బండ్ల గణేష్ మాత్రం 'వ్యక్తిగత బంధాల'తో ఈ స్థాయి నెట్‌వర్క్ నిర్మించుకున్నారు. ఈ కాలంలో బ్యాంక్ బ్యాలెన్స్ కంటే పిలవగానే వచ్చి నిలబడే 'మనుషుల బలం' ఎంతో గొప్పదని ఆయన మరోసారి నిరూపించారు.
వివాదాలు ఒకవైపు.. దోస్తీ మరోవైపు
నోటికి ఏది వస్తే అది ఓపెన్‌గా మాట్లాడేయడం, వేదిక దొరికితే పూనకం వచ్చినట్లు స్పీచ్‌లు దంచేయడం, అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకోవడం బండ్ల గణేష్‌లోని స్పెషల్ క్వాలిటీస్. చాలామందికి ఇది విమర్శలు తెచ్చిపెట్టినా ఆయనలోని ఆ నిష్కల్మషమైన, ఓపెన్ నేచరే ఆయనను అందరికీ దగ్గర చేసిందేమో.. శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకునే ఈ ‘బండ్ల మార్క్’ నైజమే ఈ రోజు సీఎంల నుంచి సెలెబ్రిటీల వరకు అందరినీ ఒకే రూఫ్ కిందకు తెచ్చింది.
కోట్ల రూపాయలు సంపాదించడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఎల్లలు లేని స్నేహాన్ని.. అందరినీ ఆకట్టుకునే 'నెట్‌వర్క్'ను సంపాదించడం అందరికీ చేతకాదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్.. పోస్టుల గోల ఒక్కటే... బండ్ల గణేష్ అసలైన ఆస్తి ఆయన బ్యాంక్ ఒకౌంట్ కాదు.. ఆయన మెయింటెన్ చేస్తున్న 'గ్లోబల్ లెవల్ నెట్‌వర్క్' మాత్రమే..
