బండ్ల గణేష్.. ఒక్క రూపాయి కూడా నష్టపోలేదట..
టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగిన నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
By: M Prashanth | 25 May 2026 11:14 AM ISTటాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగిన నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల నటుడు రాజా రవీంద్రతో చేసిన పాడ్‌కాస్ట్ లో తన నిర్మాణ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా నిర్మాణం అంటే కేవలం పేరు ప్రతిష్ట కోసం కాదని, అది పూర్తిగా వ్యాపారమని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. 'నేను సినిమా తీస్తే డబ్బులు మిగలాలి. డబ్బులు పోగొట్టుకోవడానికో, ఎవరి మెప్పు పొందడానికో సినిమా తీయను. నేను తీసిన ఒక్క సినిమాలో కూడా నష్టపోలేదు. తీన్ మార్ సినిమాలో కూడా సంపాదించాను' అని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బులు పోయేలా సినిమా నిర్మించడం వ్యాపార పరంగా తప్పని, అది పెద్ద నేరంలా భావిస్తానని కూడా తెలిపారు.
అలాగే ఇండస్ట్రీలో తనకంటే తెలివైన నిర్మాతలు చాలామంది ఉన్నారని, వారు నష్టపోయినా దానికి తమకు తెలియని వ్యాపార కారణాలు ఉండొచ్చని చెప్పారు. అయితే తాను మాత్రం లాభం లేకుండా సినిమా చేయనని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్ గా మారగా.. ఆయన వ్యాఖ్యల్లో బిజినెస్ యాంగిల్ క్లియర్ గా కనిపిస్తోందని సినీ ప్రియులు చెబుతున్నారు.
ఇక నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్ల గణేష్.. 2009లో వచ్చిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం యావరేజ్ రిజల్ట్ సాధించినా నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. ఆ సినిమాతో కూడా తాను నష్టపోలేదని ఇప్పుడు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఆయన కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా మాత్రం గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా బండ్ల గణేష్ కెరీర్ లో కూడా ఇది కీలక చిత్రం అయింది. ఈ సినిమా తర్వాత ఆయన టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ల జాబితాలో చేరిపోయారు. గబ్బర్ సింగ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో బాద్ షా, టెంపర్, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే వంటి భారీ చిత్రాలను నిర్మించారు.
ఆ సినిమాల్లో కొన్ని సూపర్ హిట్లు కాగా, మరికొన్ని యావరేజ్ ఫలితాలు మాత్రమే సాధించాయి. అయినప్పటికీ తనకు ఆర్థికంగా నష్టం రాలేదని బండ్ల గణేష్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 2015లో వచ్చిన టెంపర్ తర్వాత ఆయన నిర్మాణ రంగానికి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలు, టీవీ షోలు, సోషల్ మీడియా కామెంట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మళ్లీ సినిమాల నిర్మాణంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
