Begin typing your search above and press return to search.

ఏఐతో బాలు పాట.. రెహమాన్ నెక్స్ట్ ప్రయోగం అదే..!

ఈ సందర్భంలో రెహమాన్ ఒక ఇంటర్వూలో పాల్గొనగా ఈ ప్రయోగం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 6:07 AM GMT
ఏఐతో బాలు పాట.. రెహమాన్ నెక్స్ట్ ప్రయోగం అదే..!
X

అకాడమీ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతంతో ఎప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు. మ్యూజిషియన్ గా ఎప్పటికప్పుడు నిరంతర విద్యార్థిగా కష్టపడతాడు కాబట్టే ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్లగలిగారు. రెహమాన్ సంగీతం తో పాటలు అంటే సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి. ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ శ్రోతలను అలరించే రెహమాన్ ఈసారి దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్ ల వాయిస్ ను ఏఐ సాయంతో వినిపించనున్నారు.

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమాలో ఈ ప్రయోగాన్ని చేశారు ఏ.ఆర్.రెహమాన్. ఈ సందర్భంలో రెహమాన్ ఒక ఇంటర్వూలో పాల్గొనగా ఈ ప్రయోగం గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ లో పొన్ని నది, రోబో 2.ఓ సినిమాలో కాలమే కాలమే సాంగ్ లను బక్యా ఆలపించారు. మరోపక్క జీన్స్, కాదలన్ సినిమాలకు తన గాత్రాన్ని అందిచారు హమీద్. అయితే చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ఈ ఇద్దరి స్వరాలను ఏఐ టెక్నాలజీ ద్వారా మళ్లీ లాల్ సలాం లో వినిపించారు రెహమాన్.

లాల్ సలాం సినిమాలో తిమిరి ఎళుడా అనే పాటలో బక్యా, హమీద్ ల స్వరాలు ఏఐ ద్వారా వినిపిస్తున్నారు. ఇలా ఏఐ ద్వారా దివంగత గాయకుల స్వరాలను వినిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇందుకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నామని అంటున్నారు రెహమాన్.

వారి స్వరాలు సినిమా కోసం ఏఐ ద్వారా వినిపించాలని అనుకున్న తర్వాత వారి ఫ్యామిలీస్ పర్మిషన్ తీసుకున్నామని అన్నారు. వాళ్ల గొంతు మళ్లీ వినిపిస్తుందని తెలిసి వారి కుటుంబాలు కూడా సంతోషపడ్డాయని అన్నారు. ఆ ఇద్దరి గాత్రాలు వారి ఫ్యామిలీస్ కు ఆస్తులు లాంటివి. వాటిని వాడుకునేందుకు పర్మిషన్ తప్పనిసరి అందుకే వాళ్ల అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే అవి వాడుకున్నాం అంతేకాదు అందుకు వారి కుటుంబాలకు తగిన పారితోషికం ఇచ్చామని అన్నారు రెహమాన్.

పాత్ర ట్రాక్ లను కొత్త టెక్నాలజీతో రీ క్రియేట్ చేసేందుకు చాలా యాప్ లు ఉన్నాయి అవి చూశాక తనకు ఇలాంటి ఆలోచన వచ్చిందని అన్నారు రెహమాన్. అయితే ఇది ఒక ప్రయోగం కాబటి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అందుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్ తీసుకున్నామని అన్నారు. ఏఐతో బక్యా, హమీద్ ల స్వరాలను వాడుకున్నామని తెలిసి బాలు సార్ వాయిస్ ని కూడా ఇలా సిద్ధం చేయమని అంటున్నారు. ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు రెహమాన్.

ఈ టెక్నాలజీ వాడటంలో రిస్క్ కూడా ఉంది. సాంకేతికతను వాడటం అంటే జిమ్మిక్కు కాదని అంటున్న రెహమాన్ సరైన పద్ధతిలో అవసరమైన అనుమతులతో చేయాలి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంతోమంది స్నేహితులతో ఈ వాయిస్ రీ క్రియేషన్ చేయగలిగానని అన్నారు రెహమాన్. బక్యా, హమీద్ ల వాయిస్ సక్సెస్ అయితే నెక్స్ట్ బాలు సర్ వాయిస్ తో ప్రయోగాలు చేస్తానంటున్నాడు రెహమాన్.