భగవంత్ కేసరి ట్రైలర్: బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే 100 మంది దేవుళ్లు లెక్క!
కన్న కూతురిని రియల్ ఛాలెంజర్ గా తీర్చిదిద్దే తండ్రి కథే `భగవంత్ కేసరి`.
By: Tupaki Desk | 8 Oct 2023 3:41 PM GMTకన్న కూతురిని రియల్ ఛాలెంజర్ గా తీర్చిదిద్దే తండ్రి కథే `భగవంత్ కేసరి`. ఇది తండ్రీ కూతుళ్ల డ్రామా. ఆడ బిడ్డను కనడమే కాదు.. నేటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడే ధీరగా కూతురి(శ్రీలీల)ని తీర్చిదిద్దే గొప్ప తండ్రి(ఎన్బీకే) కథ ఇదని తాజాగా రిలీజైన ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్ ఆద్యంతం నటసింహా నందమూరి బాలకృష్ణ ఇంటెన్స్ యాక్షన్, హై ఓల్టేజ్ పంచ్ డైలాగులతో అదరగొట్టింది. అయితే ఇందులో అనీల్ రావిపూడి మార్క్ కంటే బాలయ్య మార్కే ఎక్కువ కనిపించిందని చెప్పాలి. ఇక తండ్రీ కూతుళ్ల (బాలకృష్ణ-శ్రీలీల) మధ్య సన్నివేశాలు మరో లెవల్ బ్రో అని పొగిడేయాలి.
నువ్వు ఏడున్నా గిట్ల దమ్ముతో నిలబడాలి. అప్పుడే దునియా నీ బాంచన్ అంటది..! అన్న బాలయ్య డైలాగ్ లోనే అసలు కథంతా దాగి ఉంది. అనీల్ రావిపూడి ఎంపిక చేసుకున్న ఈ థీమ్ చాలా సింపుల్ గా కనిపించినా దాని చుట్టూనే కథను తిప్పాడని ట్రైలర్ వెల్లడించింది.
నటసింహా నందమూరి బాలకృష్ణ ఇన్నాళ్లు బోయపాటి మార్క్ సినిమాలకు అలవాటు పడ్డారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా అనీల్ రావిపూడి జానర్ లో తన శైలిని మిస్సవకుండా సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ని అందించబోతున్నారని భగవంత్ కేసరి ట్రైలర్ భరోసానిచ్చింది. తాజాగా రిలీజైన భగవంత్ కేసరి ట్రైలర్ లో భయంకరమైన విలన్ (అర్జున్ రాంపాల్) ని ఢీకొట్టేవాడిగా బాలకృష్ణ కనిపిస్తున్నారు. కూతురితో ముడిపడిన వివాదాన్ని తనదైన శైలిలో ఆ యమకింకరుడు లాంటి తండ్రి (బాలకృష్ణ) ఎలా హ్యాండిల్ చేసాడన్నది తెరపై పూర్తి మసాలా అంశాలతో రావిపూడి తెరకెక్కించారు.
ట్రైలర్ ఎత్తుగడ ఆరంభమే తన గారాల కూతురు శ్రీలీలను నేటి దునియాలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఉన్న ధీరగా తీర్చిదిద్దాలని తపించే తండ్రిగా బాలయ్యను ఎలివేట్ చేసారు. ఇక తన కుమార్తెను ఆర్మీ అధికారిణిని చేయాలని దానికోసం కఠినంగా ప్రవర్తించే తండ్రిగా బాలయ్యతో సన్నివేశాల్ని ట్రైలర్ లో ఎంతో ఎమోషనల్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ ట్రైలర్ లో ఎక్కడా అదుపు తప్పిపోయే డైలాగులు కానీ సన్నివేశాలు కానీ కనిపించలేదు. ఈ విషయంలో అనీల్ రావిపూడిని అభినందించాల్సిందే. కొంతమేర సినిమాటిక్ లిబర్టీ తో యాక్షన్ సన్నివేశాల్ని చూపించినా కానీ హద్దు మీరని డైలాగ్స్, ఓవరాక్షన్ లేని యాక్షన్ తో ఫర్వాలేదనిపించాడు. ఈ సినిమాకి శ్రీలీల ఎనర్జీ ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక కాజల్ అగర్వాల్ కథానాయకుడిగా పూర్తి సపోర్టివ్ పాత్రలో కనిపించనుంది. అలాగే ఎనర్జిటిక్ విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కూడా ఈ సినిమాకి ప్రధాన అస్సెట్ కానున్నారు. ఇక ట్రైలర్ లో విజువల్ రిచ్ లొకేషన్లు ఆసక్తిని కలిగించాయి.
బాలకృష్ణ కథానాయకుడిగా, శ్రీలీల కీలక పాత్రలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి త్వరలో విడుదలకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి - హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థమన్ ఎస్ స్వరపరిచారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు ..విజయ్ లియోతో పాటు ఈ చిత్రం దసరా సందర్భంగా 19 అక్టోబర్ 2023 న థియేటర్లలో విడుదల కానుంది.