క్లాస్ డైరెక్టర్ బాలయ్య 'కురుక్షేత్రం'?
ఈ కాంబినేషన్ మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే బాలకృష్ణ మాస్ ఇమేజ్, వివేక్ ఆత్రేయ క్లాస్ టేకింగ్ కాంబినేషన్.
By: Sravani Lakshmi Srungarapu | 1 April 2026 7:00 PM ISTటాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు విభిన్న కథాంశాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలయికలో ఓ కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క టైటిల్ చుట్టూనే ప్రస్తుతం అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
పౌరాణిక నేపథ్యంలో బాలయ్య సినిమా?
కురుక్షేత్రం అనే పదం వినగానే మహాభారత యుద్ధభూమి గుర్తుకు రావడం సహజం. అందుకే ఈ సినిమా పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతుందా? లేక ఆ భావనను ఆధునిక కాలానికి అన్వయిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీసుకురాబోతున్నారా? అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టైటిల్ ను బట్టి చూస్తే, కథలో ఘర్షణ, సిద్ధాంతాల పోరు లేదా వ్యక్తిగత యుద్ధం లాంటి బలమైన అంశాలుండే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మాస్ హీరో, క్లాస్ డైరెక్టర్ కాంబో..
ఈ కాంబినేషన్ మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే బాలకృష్ణ మాస్ ఇమేజ్, వివేక్ ఆత్రేయ క్లాస్ టేకింగ్ కాంబినేషన్. ఒకవైపు పవర్‌ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య.. మరోవైపు భావోద్వేగాలు, నేటి తరం భావజాలాన్ని ప్రతిబింబించే కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ. ఈ రెండు విభిన్న శైలులు కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే ఆసక్తి సహజంగానే పెరుగుతోంది.
ప్రత్యేకంగా అఖండ2 తర్వాత బాలకృష్ణ మరొక కొత్త దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యంగ్ డైరెక్టర్‌తో పని చేయడం ద్వారా తన ఇమేజ్‌లో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంగా దీనిని కొందరు చూస్తున్నారు. ఇదే సమయంలో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ, పూర్తిస్థాయి మాస్ యాక్షన్ జానర్ వైపు మళ్లడం కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
2027 రిలీజ్ టార్గెట్ గా..
సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ లో మంచి హైప్ కనిపిస్తోంది. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో హై వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టైటిల్ నుంచి వచ్చే తీవ్రత, యుద్ధ వాతావరణం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఇక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. 2027 రిలీజ్ టార్గెట్ గా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు టాక్. అధికారిక ప్రకటన వెలువడితే, ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు మాత్రం ఈ కురుక్షేత్రం చుట్టూ ఊహాగానాల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.
