బాలయ్య-విశ్వక్ సేన్... కుండ మార్పిడి!
ఒక ఇంటి అమ్మాయి అబ్బాయిని, మరో ఇంటి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే కుండ మార్పిడి అంటారు.
By: Tupaki Desk | 2 July 2025 6:51 AMనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అఖండ సూపర్ హిట్ నేపథ్యంలో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ 2 ప్రారంభం అయినప్పటి నుంచి ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలకమైన గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన అఖండ 2 టీజర్‌లోనూ విశ్వక్ సేన్ ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. విశ్వక్ సేన్ సైతం ఆ మధ్య ఒక మీడియా చిట్ చాట్‌లో బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో క్లియర్ సమాధానం చెప్పకుండా ఔను అనే అర్థం వచ్చినట్లుగా సమాధానం ఇచ్చాడు.
అఖండ 2 సినిమాలో విశ్వక్ సేన్ కనిపించడం దాదాపుగా కన్ఫర్మ్ అంటూ అభిమానులతో పాటు అంతా బలంగా చెబుతున్నారు. బాలకృష్ణ అంటే విశ్వక్ సేన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. విశ్వక్ సేన్ సినిమాల ప్రమోషన్‌కు బాలకృష్ణ తనవంతు సహకారం అందించాడు. అంతే కాకుండా బాలకృష్ణ, విశ్వక్ సేన్ పలు సందర్భాల్లో కలుస్తూ వచ్చారు. అందుకే అవకాశం ఉంటే తప్పకుండా బాలకృష్ణతో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే విశ్వక్‌సేన్ అఖండ 2 లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా విశ్వక్‌సేన్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లోనూ బాలకృష్ణ నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబోలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటాయి. విశ్వక్ సేన్‌కు మంచి విజయాన్ని సొంతం చేసిన ఆ సినిమా సీక్వెల్ గురించి గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు దర్శకుడు తరుణ్ భాస్కర్ సీక్వెల్‌ను ప్రకటించాడు. సీక్వెల్ ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. మొదటి పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈఎన్‌ఈ రిపీట్ ఉంటుంది అంటూ మేకర్స్ బలంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ త్వరలోనే టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమయంలో ఈఎన్‌ఈ రిపీట్ సినిమాలో బాలకృష్ణ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు. స్వయంగా బాలకృష్ణ అడిగి మరీ ఈ సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఒకటి రెండు రోజులు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు గాను రెడీ అన్నట్లు సమాచారం అందుతోంది. దాంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక మంచి పాత్రను క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. బాలకృష్ణ ఎంట్రీతో ఈ సీక్వెల్ స్థాయి మరింతగా పెరగడం ఖాయం.
ఒక ఇంటి అమ్మాయి అబ్బాయిని, మరో ఇంటి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే కుండ మార్పిడి అంటారు. ఇప్పుడు విశ్వక్ సేన్ అఖండ 2 లో నటిస్తుండగా, ఈఎన్‌ఈ రిపీట్‌లో బాలకృష్ణ నటిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో కుండ మార్పిడి అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం చాలా మంచిదని, ఒకరికి ఒకరు సహకరించుకోవడం, ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్‌లో కనిపించడం బాలీవుడ్‌లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం.
బాలకృష్ణ వంటి స్టార్ హీరో విశ్వక్ సేన్ వంటి చిన్న హీరో సినిమాలో నటించడం అనేది కచ్చితంగా మంచి పరిణామం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యి, రెండు గెస్ట్ పాత్రలకు మంచి స్పందన వస్తే తప్పకుండా ముందు ముందు మరిన్ని ఇలాంటి కుండ మార్పిడి సినిమాలు ఉంటాయేమో చూడాలి.