'ఆదిత్య 999'.. బాలయ్య బిగ్ డెసిషన్!
అయితే బాలయ్యతో చేయబోయే సినిమా కథ విషయంలో క్రిష్ ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే, బాలయ్య వద్ద 'ఆదిత్య 999' స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది.
By: Tupaki Desk | 11 May 2025 4:30 PM'హరిహర వీరమల్లు' కోసం దాదాపు నాలుగేళ్లు టైమ్ వేస్ట్ చేసుకున్న డైరెక్టర్ క్రిష్.. ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి అనుష్కతో 'ఘాతి' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని పట్టాలెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అనంతరం క్రిష్ ను లాక్ చేశారు బాలయ్య. గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తరవాత వీళ్ల కాంబో మళ్లీ సెట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా టాక్ వినిపిస్తోంది. ఆర్కా మీడియా సంస్థ వీరి చిత్రాన్ని నిర్మించబోతోంది.
అయితే బాలయ్యతో చేయబోయే సినిమా కథ విషయంలో క్రిష్ ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే, బాలయ్య వద్ద 'ఆదిత్య 999' స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని బాలయ్య ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. కానీ ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. ఓవైపు నటుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా బాలయ్య ఎన్నో బాధ్యతలు మోస్తున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్షన్ వైపు అడుగులు వేయడం అనేది ఎంతో ఒత్తిడితో కూడకున్న పని. ఇవన్ని ఆలోచించే ఆదిత్య 999 స్క్రిప్ట్ ను క్రిష్ చేతుల్లో పెట్టాలని బాలయ్య నిర్ణయించుకున్నారట.
వాస్తవానికి సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు. అయితే వయసు పైబడటంతో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. బాలయ్యకు డైరక్షన్ చేయాలని ఉన్నా, ఆ ఆలోచనను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య మైండ్ సెట్ బాగా అర్థం చేసుకునే దర్శకుల్లో క్రిష్ ఒకరు. పైగా వర్క్ విషయంలోనూ ఆయన చాలా ఫాస్ట్ గా ఉంటారు. అందుకే ఆదిత్య 999 బాధ్యతను క్రిష్‌కి అప్పగించాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ విషయంలో క్రిష్ కూడా సానుకూలంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే క్రిష్, బాలయ్య కాంబో మూవీలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడని అంటున్నారు. ఆదిత్య 999 తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గతంలో బాలయ్య ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. అయితే ఆరంభంలోనే వీరి ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగబోతుందని టాక్ వినిపిస్తోంది.