కోరుకున్న కారు నెంబరు కోసం బాలయ్య పెట్టిన ఖర్చు ఎంతంటే?
కోరుకున్న కారును సొంతం చేసుకోవటానికి ఎంత ఆరాటం ఉంటుందో.. అంతే అత్రుత సదరు కారుకు ఉండే నెంబరు విషయంలోనూ కొందరు చాలా కచ్ఛితంగా ఉంటారు.
By: Tupaki Desk | 20 April 2025 4:20 AMకోరుకున్న కారును సొంతం చేసుకోవటానికి ఎంత ఆరాటం ఉంటుందో.. అంతే అత్రుత సదరు కారుకు ఉండే నెంబరు విషయంలోనూ కొందరు చాలా కచ్ఛితంగా ఉంటారు. కారు కొన్నంతనే సరిపోదు. కారుకు ఉండే నెంబరు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు కొందరు. తాజాగా ప్రముఖ సినీ నటులు.. ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తన కొత్త కారు నెంబరు కోసం భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.
ఇటీవల కొన్న బీఎండబ్ల్యూ కారుకు నెంబరు కోసం వేలంపాటలో పాల్గొని.. భారీగా బిడ్ దాఖలు చేసి.. సదరు నెంబరును సొంతం చేసుకున్నారు. టీజీ09 ఎఫ్0001 ఫ్యాన్సీ నెంబరును రూ.7.75లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు ఒకే రోజున రూ.37.15 లక్షల మొత్తం లభించింది. అది కూడా ఖైరతాబాద్ జోన్ పరిధిలో కావటం విశేషం.
తాజా వేలంలో రూ.లక్ష దాటి పలికిన ఫ్యాన్సీ నంబర్లతో వచ్చిన ఆదాయాన్ని అధికారులు ప్రకటించారు. టీజీ09 ఎఫ్ 0009 నంబరును కమలాలయ హైసాఫ్ట్ సంస్థ సొంతం చేసుకోగా.. ఎఫ్ 0005 నంబరును జెట్టి ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.1,49,999 మొత్తానికి సొంతం చేసుకున్నారు.
ఎఫ్ 0007 నంబరును శ్రీనివాస్ నాయుడు రూ.1,237,779 మొత్తాన్ని చెల్లించగా.. ఎఫ్ 0019 నంబరును నేత్రావతి బలగప్ప శివలిప్ప రూ.60 వేలు చెల్లించేందుకు ముందుకు రాగా.. ఎఫ్ 0099 నంబరును కాన్కాప్ ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.4,75,999 చెల్లించేందుకు ముంుకు వచ్చింది. గత సిరీస్ లోని టీజీ09ఈ999 నంబరును ఈకో డిజైన్ స్టూడియో రూ.99,999 చెల్లించింది. ఈ వేలంలో ఫ్యాన్సీ నంబర్లను సొంతంచేసుకున్న తీరు చూసినప్పుడు.. వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన వాహనాల కంటే సంస్థ పేర్ల మీద కొనుగోలు చేసిన వాహనాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.