పంథా మార్చిన నందమూరి బాలకృష్ణ!
టాలీవుడ్ లో నాలుగు దశాబ్దాలుగా తనదైన మాస్ ఇమేజ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కెరీర్ లో కొత్త స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు.
By: M Prashanth | 11 Feb 2026 12:09 PM ISTటాలీవుడ్ లో నాలుగు దశాబ్దాలుగా తనదైన మాస్ ఇమేజ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కెరీర్ లో కొత్త స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు మాస్, రొటీన్ కమర్షియల్ కథలకు పరిమితమైన బాలయ్య.. ఇప్పుడు కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న, స్టైలిష్ ఎలిమెంట్స్ తో కూడిన విభిన్న కథలను ఎంచుకుంటూ ట్రెండ్ మార్చుతున్నారు. దీంతో యంగ్ డైరెక్టర్లకు ఆయన హాట్ ఫేవరెట్ గా మారడం విశేషం.
అయితే గత ఏడాది మొదట్లో డాకు మహారాజ్ తో వచ్చి విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఆ తర్వాత అఖండ 2తో మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారు. ఓవరాల్ గా సినిమా హిట్ కాకపోయినా.. వయసుతో సంబంధం లేకుండా వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇవ్వడం గమనార్హం. బాలయ్య సినిమా విడుదలైతే థియేటర్లలో కనిపించే హంగామా ఇప్పటికీ అదే రేంజ్ లో ఉండటం ఆయన స్టార్ డమ్ కు పర్ఫెక్ట్ ఎవిడెన్స్.
అదే సమయంలో ఇప్పుడు బాలయ్య అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముందుగా గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ కాంబో రిపీట్ అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఆ మూవీ షూటింగ్ మార్చి 19 నుంచి ప్రారంభం కానుంది!
యాక్షన్ డ్రామాకు ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేసి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. ఉగాది తర్వాత షూటింగ్ స్పీడ్ పెంచి, దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని టాక్. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గ మాస్ ఎలిమెంట్స్ తో కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
డాకు మహారాజ్ ను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీనే ఆ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే అందరిలో ఎక్కువ ఆసక్తి రేపుతున్న కాంబినేషన్ మాత్రం వివేక్ ఆత్రేయతో బాలయ్య మూవీ. బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్, బాలయ్యను కొత్త యాంగిల్ లో చూపించే కథ సిద్ధం చేశారట.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని, 2027 మధ్యలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఏదేమైనా వివేక్ ఆత్రేయతో మూవీ అంటే.. బాలయ్య ప్రయోగం చేస్తున్నారనే చెప్పాలి. మొత్తానికి తన పంథాను మార్చుకున్న నటసింహం లైనప్ మాస్, స్టైలిష్, కంటెంట్ ఓరియెంటెడ్, ప్రయోగాత్మక చిత్రాలతో మిక్స్ డ్ బ్యాగ్ గా కనిపిస్తోంది. మరి కొత్త చిత్రాలతో బాలయ్య ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.
