డాకు మహారాజ్ అన్‌స్టాపబుల్
డాకు మహారాజ్ 175 రోజుల రికార్డుకు చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్ వేదికైంది.
By: Tupaki Desk | 6 July 2025 3:00 PM ISTనందమూరి నట విశ్వరూపం.. టాలీవుడ్ నటసింహ బాలకృష్ణ మరోసారి తాను బాక్సాఫీస్ రూలర్ అనిపించుకున్నారు. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్‌సినిమా విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకోవడంతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విశేషమేంటంటే బాలయ్య నటించిన చివరి నాలుగు సినిమాలు 175 రోజుల మార్క్‌ను అందుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బాలకృష్ణ చివరిగా నటించిన నాలుగు సినిమాలైన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్ గా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. బాలయ్యను గాడ్ ఆఫ్ మాసెస్ గా కొలుస్తున్న అభిమానులకు తాజాగా డాకు మహారాజ్ సినిమా కూడా 175 రోజుల మార్క్‌ను చేరుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు. డాకు మహారాజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.126 కోట్లు కలెక్షన్స్ రావడంతో బాలయ్య స్టామినాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
డాకు మహారాజ్ 175 రోజుల రికార్డుకు చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్ వేదికైంది. ఈ ఏడాది జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి రోజు నాలుగు షోలను ఈ థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. దీంతో వరుసగా బాలయ్య నటించిన నాలుగో మూవీ 175 రోజుల మార్క్‌ను చేరుకుంది. తెలుగు ఇండ్రస్టీలో ప్రస్తుతమున్న సీనియర్ హీరోల్లో ఎవరికీ లేని సక్సెస్‌ను బాలయ్య ఆస్వాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఇకపోతే బాలయ్య ప్రస్తుతం అఖండ-2 తాండవం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా తుది దశకు చేరుకుంది. బోయపాటి శ్రీను-బాలయ్య క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న అఖండ-2తో బాలయ్య ఈసారి తన మాస్ పవర్‌నూ నార్త్‌లోనూ చూపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
