సహజత్వం కోసం బోయపాటి ఏం చేస్తున్నాడంటే
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి.
By: Tupaki Desk | 25 July 2025 4:00 PM ISTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ. ఈ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈ కాంబినేషన్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లను అందుకుంది.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుంది. అదే అఖండ2. ఈ సినిమాతో రెండో హ్యాట్రిక్ కు బలమైన పునాది వేయాలని బాలయ్య, బోయపాటి చూస్తున్నారు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ2 పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆ అంచనాల్ని ఇంకాస్త పెంచింది.
ఇదిలా ఉంటే అఖండ2 సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. వారం రోజుల పాటూ జరిగే ఈ కీలక షెడ్యూల్ లో బాలకృష్ణకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. సినిమాలోని భారీ యాక్షన్ సీన్స్ ను మరింత సహజంగా తెరకెక్కించేందుకు మారేడుమిల్లిలో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న అఖండ2: తాండవం షూటింగును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు అఖండకు సంగీతం అందించిన తమనే మ్యూజిక్ అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట అఖండ2 ను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ అఖండ2 సినిమాకు సమర్పకురాలిగా వ్యహరిస్తున్నారు.
