Begin typing your search above and press return to search.

శివుని ఆశీస్సులతో చలి పెట్టలేదు : బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ త్వరలో 'అఖండ : 2 తాండవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూడున్నర ఏళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   11 Jun 2025 3:14 PM IST
శివుని ఆశీస్సులతో చలి పెట్టలేదు : బాలకృష్ణ
X

నందమూరి బాలకృష్ణ త్వరలో 'అఖండ : 2 తాండవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూడున్నర ఏళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ మూడు సినిమాలను మించి అఖండ 2 సినిమా ఉంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లో, రాజకీయ వర్గాల్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి జోరు మీద ఉన్న ఈ సమయంలో వరుసగా సినిమాల్లోనూ హిట్‌ కొడుతున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణ 'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది. అంతే కాకుండా అభిమానులు ఆ సినిమాను ఆహా.. ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అలాంటి డాకు మహారాజ్ సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అఖండ 2 పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా బోయపాటి దాదాపు ఏడాది సమయం తీసుకుని మరీ ఈ సినిమాను రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడికి రెడీ అయింది. సెప్టెంబర్‌ 25, 2025న విడుదల కాబోతున్న అఖండ 2 సినిమా గురించి తాజాగా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ తన పుట్టిన రోజును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్‌ ఆసుపత్రిలో జరుపుకున్నారు. ఆ సమయంలో బాలకృష్ణ అఖండ 2 గురించి మాట్లాడాడు. బోయపాటి ఈ సినిమాను అద్భుతంగా తీస్తున్నాడు. ఆయన మేకింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్నారు. అంతే కాకుండా ఇటీవల అఖండ 2 సినిమాలోని కొన్ని సన్నివేశాలను జార్జియాలో షూట్‌ చేశాం. అక్కడ -4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అంత చలిని యూనిట్‌ సభ్యులు తట్టుకోలేక పోయారు. కానీ తాను మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను, ఆ చలిని తట్టుకుని మరీ నేను షూటింగ్‌ చేశాను. శివుని ఆశీస్సులు కారణంగానే నాకు చలి పెట్టలేదు అన్నట్లుగా బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అఖండ నుంచి ఇటీవల వచ్చిన టీజర్‌లో జార్జియాలో షూట్‌ చేసిన మంచు సన్నివేశాలను చూపించారు. నిజంగానే చాలా మంచు ఉన్న ప్రాంతంలో షూట్‌ చేసినట్లుగా అనిపించింది. అలాంటి సన్నివేశాల్లో యంగ్‌ హీరోలు కూడా నటించేందుకు భయపడుతారు, టెన్షన్‌ పడుతారు. అలాంటిది బాలకృష్ణ అంతటి చలిలో షూటింగ్‌లో పాల్గొనడం, అది కాకుండా యాక్షన్‌ సన్నివేశాలను చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. శివుని ఆశీస్సుల వల్లే తాము అఖండ 2 సినిమాను అద్భుతంగా పూర్తి చేశామని, విడుదల తర్వాత కచ్చితంగా అంతా కూడా అఖండ 2 సినిమాను ఆస్వాదిస్తారు అనే విశ్వాసం ను బాలకృష్ణ వ్యక్తం చేశాడు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పలువురు ముద్దుగుమ్మలు నటించినట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయెల్‌ రోల్లో కనిపించబోతున్నారట.