Begin typing your search above and press return to search.

'ఎల్ల‌మ్మ' కోసం వేణు బ‌ల‌గం ఫార్ములా

క‌మెడియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో క‌మెడియ‌న్‌గా గుర్తింపుని, స‌రైన అవ‌కాశాల్ని వేణు ద‌క్కించుకోలేక‌పోయాడు.

By:  Tupaki Desk   |   4 April 2025 2:00 PM IST
ఎల్ల‌మ్మ కోసం వేణు బ‌ల‌గం ఫార్ములా
X

క‌మెడియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో క‌మెడియ‌న్‌గా గుర్తింపుని, స‌రైన అవ‌కాశాల్ని వేణు ద‌క్కించుకోలేక‌పోయాడు. అయితే న‌టుడిగా క‌న్నా `బ‌ల‌గం` సినిమాతో ద‌ర్శ‌కుడిగా విశేష‌మైన గుర్తింపుతో పాటు ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్రశంస‌ల్ని సొంతం చేసుకుని ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ప్రియ‌ద‌ర్శి, కావ్య క‌ల్యాణ్‌రామ్, ముర‌ళీధ‌ర్‌గౌడ్‌ మిన‌హా అంతా కొత్త వాళ్ల‌తో వేణు తెర‌కెక్కించిన ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

వంద‌కు పైగా ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల్ని ద‌క్కించుకున్న ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన `బ‌ల‌గం` వేణు ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ వేణు అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తూ మ‌రోసారి మ‌ట్టిక‌థ‌తో ఎల్ల‌మ్మ‌` సినిమాని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ముందు ఈ ప్రాజెక్ట్‌ని నేచుర‌ల్ స్టార్ నానితో చేయాల‌ని ప్లాన్ చేశాడు. చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ ఫైన‌ల్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి నాని త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో నితిన్‌ని ఫైన‌ల్ చేశారు.

దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌డానికి రెడీ అవుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ద‌ర్శ‌కుడు వేణు మ‌ళ్లీ `బ‌ల‌గం` ఫార్ములానే ఫాలోఅవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. `బ‌ల‌గం` సినిమా కోసం రంగ‌స్థ‌ల క‌ళాకారుల్ని తెర‌పైకి తీసుకొచ్చి శ‌భాష్ అనిపించుకున్న వేణు `ఎల్ల‌మ్మ‌` సినిమా కోసం కూడా ఇదే పంథాని అనుస‌రిస్తున్న‌ట్టుగా తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం బ‌ల‌గం వేణు రంగ‌స్థ‌ల క‌ళాకారుల కోసం వేట మొద‌లుపెట్టిన‌ట్టుగా తెలిసిది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌ల్లెల్లో, న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తున్న వేణు సిరిసిల్ల‌, నిజామాబాద్‌ల‌లోనూ ప‌ర్య‌టించాడ‌ట‌. ఇప్ప‌టికే ప‌లువురు రంగ‌స్థ‌ల క‌ళాకారుల్ని ఎంపిక చేసిన‌ట్టుగా తెలిసింది. వీరిని ప్ర‌త్యేకంగా స్టేజ్ డ్రామాలు, వారి న‌ట‌న‌ను ప‌రిశీలించాకే వేణు ఎంపిక చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. రంగ‌స్థ‌ల క‌ళాకారుల‌ని తీసుకుని `బ‌ల‌గం`తో మ్యాజిక్ చేసిన వేణు మ‌ళ్లీ అదే ఫార్ములాతో `ఎల్ల‌మ్మ‌`తోనూ అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.