Begin typing your search above and press return to search.

'బకాసుర రెస్టారెంట్' ట్రైలర్: మరోసారి ప్రవీణ్ హారర్ కామెడీ

ట్రైలర్ విషయానికి వస్తే.. హోటల్ పెట్టడానికి 50 లక్షలు ఎలా సంపాదించాలని అనుకుంటున్న ఫ్రెండ్స్ గ్యాంగ్ కు అనుకోని సమస్యలు వచ్చి పడతాయి.

By:  Tupaki Desk   |   17 May 2025 10:09 AM IST
బకాసుర రెస్టారెంట్ ట్రైలర్: మరోసారి ప్రవీణ్ హారర్ కామెడీ
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథా చిత్రం, స్వామిరారా వంటి సినిమాలతో ఎదుగుతూ వచ్చి కామెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్, ఇప్పుడు హీరోగా ‘బకాసుర రెస్టారెంట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతుండగా, ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. హోటల్ పెట్టడానికి 50 లక్షలు ఎలా సంపాదించాలని అనుకుంటున్న ఫ్రెండ్స్ గ్యాంగ్ కు అనుకోని సమస్యలు వచ్చి పడతాయి. ఒక పాత బంగ్లాకు వెళ్లిన క్రమంలో బకాసుర అనే ఆత్మ వారిని మరింత సమస్యలు తెచ్చి పెడుతుంది. ఈ క్రమంలో సమాధానం దొరికాలి అంటే ప్రశ్న తెలియాలి అనే కోణంలో ట్రైలర్ ను హైలెట్ చేశారు. కామెడీ హారర్ మిక్స్ చేసి ఒక డిఫరెంట్ స్టొరీ లైన్ ను చెప్పబోతున్నట్లు అర్ధమవుతుంది.

అలాగే ఈ ట్రైలర్‌లో ‘నువ్వు ప్రేమ కథా చిత్రం పార్వతి కదా?’ అనే డైలాగ్‌తో ప్రవీణ్ నవ్వులు పంచుతున్నాడు. హారర్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాని కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతుండటం విశేషం అని మేకర్స్ అన్నారు.

కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, జబర్దస్త్ అప్పారావు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుండగా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని దర్శకుడు ఎస్‌జే శివ చెప్పారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది, దీనికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మారుతి మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్ చాలా పాజిటివ్ వైబ్‌ను ఇస్తోందని, సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని, ప్రవీణ్ కెరీర్‌లో ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నాడు. ఇక ప్రవీణ్ మాట్లాడుతూ, మారుతి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉందని, ‘ప్రేమ కథా చిత్రం’ సినిమా తన కెరీర్‌ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.

నిర్మాత జనార్థన్ ఆచారి మాట్లాడుతూ, కథ వినగానే ఈ పాత్రకు ప్రవీణ్ సరిపోతాడని అనిపించిందని, ఆర్టిస్టులు అందరూ ఎంతో సపోర్ట్ చేశారని, గరుడ రామ్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రవీణ్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని, ప్రతి పాత్రను జాగ్రత్తగా డిజైన్ చేశామని, సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు.

వైవా హర్ష మాట్లాడుతూ, ఈ సినిమా అందరికీ బెంచ్‌మార్క్ ఫిల్మ్ అవుతుందని, కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమని, ప్రవీణ్ హీరోగా మారడం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమాకు బాల సరస్వతి సినిమాటోగ్రఫీ, మార్తండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, వికాస్ బడిస సంగీతం అందించారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.