బకాసుర రెస్టారెంట్.. థియేటర్స్ లోకి వచ్చేది ఆ రోజే..
తెలుగు సినీ ప్రేక్షకులకు వినోదాన్ని విందులా పరిపూర్ణంగా అందించేందుకు సిద్ధమవుతోంది 'బకాసుర రెస్టారెంట్' మూవీ.
By: Tupaki Desk | 18 July 2025 2:46 PM ISTతెలుగు సినీ ప్రేక్షకులకు వినోదాన్ని విందులా పరిపూర్ణంగా అందించేందుకు సిద్ధమవుతోంది 'బకాసుర రెస్టారెంట్' మూవీ. ఈ సినిమాతో ప్రముఖ కామెడియన్ ప్రవీణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఎస్‌జే శివ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో వినూత్నంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ సినిమా యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడానికి వస్తోందని ట్రైలర్ స్పష్టంగా తెలిపింది. బకాసుర అనే ఆత్మ చుట్టూ నడిచే కథకు హంగర్, హారర్, హ్యూమర్ అన్న మూడూ ప్రధానంగా ఉన్నాయి. ఇది ఓ “హంగర్ ఎంటర్‌టైనర్”గా రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు. ప్రవీణ్ పాత్రతో పాటు వైవా హర్ష టైటిల్ రోల్‌లో ఆకట్టుకునేలా కనిపించనున్నాడు.
డైరెక్టర్ ఎస్‌జే శివ మాట్లాడుతూ, ‘‘ఈ ఆగస్టు 8న మా సినిమా బకాసుర రెస్టారెంట్ తెలుగు ప్రేక్షకులకు వినోద భోజనంలా ఉంటుందనేది మా నమ్మకం. ప్రతీ సీన్ నవ్వులు పుట్టించడంతో పాటు థ్రిల్ కూడా కలిగిస్తుంది. సినిమా చూసినవారికి సంతృప్తి కలిగించేలా మేము తీర్చిదిద్దాం’’ అన్నారు. కామెడీ, హారర్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలూ ఇందులో కీలకంగా ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో కమెడియన్ ప్రవీణ్, వైవా హర్షతో పాటు షైనింగ్ ఫణి (బుంచిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ డండు, జబర్దస్త్ అప్పారావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులను భలే ఆకట్టుకుంటాయని దర్శకుడు తెలిపాడు. టెక్నికల్ టిమ్ విషయానికి వస్తే… సినిమాటోగ్రఫీ బాల సరస్వతి, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్ అందించగా, సంగీతాన్ని వికాస్ బడిస అందించారు.
శ్రీ రాజా టంగల్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహించగా, వినయ్ కోట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. వినూత్నమైన కాన్సెప్ట్, బలమైన కామెడీ, మసాలా ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకునే అవకాశం ఈ సినిమాకుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక బకాసుర రెస్టారెంట్ ని చూసిన తరువాత ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
